మళ్లీ కదలిక! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కదలిక!

Nov 28 2026 10:29 AM | Updated on Nov 28 2026 10:29 AM

శనివారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 సాక్షి, రంగారెడ్డిజిల్లా: నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే మహిళా బిల్లుతో సహా డీలిమిటేషన్‌ బిల్లును సైతం తీసుకొచ్చి ఆమోదింపజేయాలని కేంద్రం భావించింది. మహిళా బిల్లు పార్లమెంట్‌లో వీగిపోవడంతో తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. తాజాగా మళ్లీ ఈ రెండు బిల్లులను తెరపైకి తెచ్చింది. ఈ నెల 30 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గాల పునర్వీభజన సహా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ (మహిళా బిల్లు)కు ఆమోదం పొందేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బిల్లు ఆమోదం పొందితే జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారొచ్చు. ఫ్యూచర్‌సిటీ పేరుతో సహా మరో నాలుగు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ మార్పులు, చేర్పులు చోటు చేసుకోవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటినీ ఒకే పార్లమెంట్‌స్థానం పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లు వారి ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. నియోజకవర్గాల పునర్విభజన అంశం కొంత మంది నేతల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుంటే.. మరికొంత మందిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. డీలిమిటేషన్‌లో భాగంగా ఇప్పటికే పట్టున్న సొంత నియోజకవర్గాలను వదులుకొని పక్క నియోజకవర్గాలకు చేరి, ఇప్పుడిప్పుడే అక్కడ పట్టు సాధిస్తున్న ఆయా నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరికొంత మంది నేతలు తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించొచ్చని భావిస్తున్నారు. తమకు పట్టున్న ప్రాంతాలను తీసి, కొత్తగా ఏర్పాటు చేసే నియోజకవర్గాల్లో కలిపితే తమ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న మరి కొంతమంది నేతల్లో తలెత్తుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వీటిలో మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, చేవెళ్ల లోక్‌సభ స్థానంలోకి వెళ్లాయి. కల్వకుర్తి(ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్‌ మండలాలు) నాగర్‌కర్నూల్‌ లోక్‌సభస్థానం పరిధిలోకి వెళ్లాయి. ఇబ్రహీంప్నటం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాలు యాదాద్రి భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కొసాగుతున్నాయి. ఎల్బీనగర్‌ నియోజకవర్గం పూర్తిగా మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కొనసాగుతోంది. షాద్‌నగర్‌ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో కలిసి ఉంది. డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదం పొందితే ఆయా లోక్‌సభాస్థానాల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలోని మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి నాలుగు మండలాలు కల్వకుర్తి నియోజకవర్గంలో కలిసి ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వెల్దండ, కల్వకుర్తి, చారకొండ మండలంలోని నాలుగు గ్రామాలు సైతం ఇదే నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. పాలనా పరంగా ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉండటంతో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు రెండు చోట్ల నిర్వహించే సభలు, సమావేశాలుకు హాజరుకావాల్సి వస్తోంది. నిధుల కేటాయింపు, పంపకాల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు. నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. కల్వకుర్తిని నాగర్‌కర్నూల్‌ జిల్లాకు వదిలేసి ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్‌ మండలాలను కలుపుకొని కందుకూరు కేంద్రంగా ఫ్యూచర్‌సిటీ పేరుతో కొత్త అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది. ఇదే జరిగితే ఇప్పటికే ఇక్కడ ద్వితీయశ్రేణి కేడర్‌గా మిగిలిపోయిన కీలక నేతలకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కనుంది. రాజేంద్రనగర్‌ నుంచి కొత్తగా శంషాబాద్‌, మహేశ్వరం నుంచి సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌, శేరిలింగంపల్లి నుంచి కొత్తగా కొండాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఎనిమిది నుంచి 12కు చేరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

18 ఏళ్ల తర్వాత

తిరిగి తెరపైకి..

డీలిమిటేషన్‌ అంటే జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను, వాటి పరిధిలోని మండలాలు, గ్రామాలను పునర్వ్యవస్థీకరించడం. దీని ప్రధాన ఉద్దేశం జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని కల్పించడం. జనాభా పెరుగుదలకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యంలో మార్పులు. పట్టణీకరణ చెందిన ప్రాంతాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యం. గ్రామీణ ప్రాంతాల రాజకీయ సమీకరణాల్లో మార్పులు. ఎస్సీ రిజర్వేషన్ల కారణంగా అభ్యర్థుల ఎంపికలో మార్పులు. పాత రాజకీయ సమీకరణాలు బలహీనపడటం, కొత్త నాయకత్వానికి అవకాశాలు రావడం. ఒకే నియోజకవర్గంలో విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్న ప్రాంతాలు కలవడం ద్వారా అభివృద్ధి ప్రాధాన్యాల విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2002లో డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. 2008లో డీలిమిటేషన్‌ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. 2009 ఎన్నికల నుంచి కొత్త నియోజకవర్గాల విధానం అమలైంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది.

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

నేతల్లో కలవరం

ఫ్యూచర్‌సిటీ పేరుతో కొత్త నియోజకవర్గం?

మాట్లాడుతున్న డీఆర్డీవో శ్రీలత

తెరపైకి మహిళా,

పునర్విభజన బిల్లులు

జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలు

రిజర్వేషన్లు, సరిహద్దుల్లో భారీ మార్పులకు అవకాశం

చర్చనీయాంశంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం

కొంతమంది నేతల్లో ఆందోళన.. మరికొందరిలో ‘కొత్త’ ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement