అర్హులందరికీ చేయూత | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ చేయూత

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

● పింఛన్ల మంజూరు పారదర్శకంగా నిర్వహించాలి

● కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అధికారులను ఆదేశించారు. పింఛన్ల మంజూరు, వీబీజీరామ్‌జీ పనులపై బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారదర్శకంగా పింఛన్ల మంజూ రు ప్రక్రియ చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. అనర్హులకు పథకం అమలైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వికలత్వంపై ఏమైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు.

భూగర్భ జలాల పెంపునకు చర్యలు

నీటి కుంటలు, బోర్‌వెల్‌ రీచార్జ్‌, ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించడం, భూగర్భ జలమట్టాన్ని పెంచడం, వర్షపు నీటిని సంరక్షించడం లక్ష్యంగా వీబీజీరామ్‌జీ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, జెడ్పీ సీఈఓ సుధీర్‌, అదనపు డీఆర్‌డీఓ నర్సింలు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

భూముల రీ సర్వేకు చర్యలు

జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేస్తామని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. బుధవారం నగరం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భూముల రీ సర్వే పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ సమర్థవంతంగా సాగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, తాండూరు, వికారాబాద్‌ ఆర్‌డీఓలు అనిత, వాసుచంద్ర, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ మధుసూదన్‌ పాల్గొన్నారు.

మౌలానా సేవలు చిరస్మరణీయం

స్వాతంత్య్ర సమర యోధుడు.. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేమని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. బుధవారం ఆయన జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలానా అరబిక్‌, ఇంగ్లిష్‌, ఉర్దూ, హిందీ, పర్షియన్‌, బెంగాలీ తదితర భాషల్లో ప్రావీణ్యత పొందారన్నారు. హిందూ, ముస్లిం ఐక్యత ఆధారంగా ఆల్‌ బలగ్‌ అనే పత్రికను ప్రారంభించి భారత జాతీయ వాదిగా పేరుగాంచారని పేర్కొన్నారు. ఆజాద్‌ ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్‌ వ్యతిరేక భావాలు పెంచి అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్ల పాటు పనిచేసిన మౌలానాకు మరణాంతరం 1992లో భారతరత్న పురస్కారం లభించిందన్నారు. విద్య లేకుండా దేశం అభివృద్ధి చెందదని, విద్య స్వాతంత్య్రానికి రెండో రూపముగా పేర్కొన్న మౌలానా భారత విద్యావ్యవస్థకు బలమైన పునాదివేసిన మహానుభావుడని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి, జెడ్పీ సీఈఓ సుధీర్‌, మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్స్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement