ఆదివాసీ–బంజారా సభలపై డీజీపీకి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ–బంజారా సభలపై డీజీపీకి ఫిర్యాదు

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

ఆదివాసీ–బంజారా సభలపై డీజీపీకి ఫిర్యాదు భవన అనుమతులపై థాయ్‌ బృందం ఆసక్తి సైనిక సిబ్బంది, రక్షణ శాస్త్రవేత్తలకు సత్కారం 15న జైన సాధ్విగా దీక్ష స్వీకరించనున్న సంజన

లక్డీకాపూల్‌ : ఆదివాసీ–బంజారా సభలపై డిసెంబరు 9న నగరంలో జరిగే ’చలో హైదరాబాద్‌’ కార్యక్రమాల నేపథ్యంలో గిరిజన తెగల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని సేవాలాల్‌ బంజారా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కోర్ర మోతిలాల్‌ నాయక్‌ బుధవారం డీజీపీకి వినతిపత్రం అందజేశారు. ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) నేత మైపతి అరుణ్‌ కుమార్‌, లంబాడీలను తొలగించాలనే డిమాండ్‌తో డిసెంబరు 9న లక్ష మందితో ’చలో హైదరాబాద్‌’ చేపట్టనున్నారని ప్రచారం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సేవాలాల్‌ సేన నాయకుడు భూక్య సంజీవ్‌ నాయక్‌, ’లంబాడీలను ఎలా తొలగిస్తారు?’ అని ప్రశ్నిస్తూ అదే రోజు ఐదు లక్షల మందితో హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామని ప్రకటించినట్లు తెలుస్తోందని వివరించారు. ఇరువర్గాల నేతల ప్రకటనలపై సమగ్ర విచారణ జరిపించి అవసరమైతే ఇరువర్గాల సభలకు అనుమతులు నిరాకరించాలన్నారు.

● జీహెచ్‌ఎంసీ ‘బిల్డ్‌నౌ’ సేవలపై

అధ్యయనం

సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీ అమలు చేస్తున్న డిజిటల్‌ విధానాలను అధ్యయనం చేసేందుకు థాయ్‌లాండ్‌ ప్రతినిధి బృందం జీహెచ్‌ఎంసీని సందర్శించింది. థాయ్‌ పార్లమెంట్‌ ప్రతిపక్ష నాయకుడి సలహాదారు పీంగ్‌పనోర్‌ బూన్‌క్లమ్‌, ప్రోగ్రెసివ్‌ మూవ్‌మెంట్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్‌ ఆమోదాలు, టీడీఆర్‌ సేవలను ఒకే వేదికపై అందిస్తున్న ‘బిల్డ్‌నౌ’ ప్లాట్‌ఫారమ్‌ పనితీరును అధికారులు వివరించారు. దరఖాస్తుల ప్రక్రియను సరళీకరించడం, పారదర్శకత పెంచడం, అనుమతులను వేగంగా జారీ చేయడం వంటి అంశాలను వివరించారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్లు పి. ఉదయ్‌ కుమార్‌, రాధిక గుప్తా పాల్గొని డిజిటల్‌ పాలన కార్యక్రమాలపై వివరించారు.

శంషాబాద్‌ రూరల్‌: దేశానికి అంకితభావంతో, నిబద్ధతతో సేవ చేసిన దేశ వీరపుత్రులను, శాస్త్రవేత్తలను సత్కరించడం తనకు గౌరవమని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి అన్నారు. ముచ్చింతల్‌ శివారులోని శ్రీరామనగరం సమతాస్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న ‘యతీంద్ర సప్తతి’ వేడుకల్లో భాగంగా బుధవారం సైనిక సిబ్బంది, రక్షణ శాస్త్రవేత్తలు, మహిళా సాధకులను సత్కరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ దేశ శక్తికి, సంకల్పానికి ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత భయ్యాజీ జోషి మాట్లాడుతూ.. భారతదేశం ఎల్లప్పుడూ సాధువుల దేశమని, కాలానుగుణంగా వారు ప్రజలకు దిశానిర్దేశం చేశారని అన్నారు. కార్యక్రమంలో కార్గిల్‌ యుద్ధ వీరుడు, పరమ వీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్‌ యోగేంద్ర సింగ్‌ యాదవ్‌, వైమానిక దళ పైలట్‌ గ్రూప్‌ కెప్టెన్‌ కె.సచికేత తదితరులు పాల్గొన్నారు.

నాంపల్లి: మహారాష్ట్రకు చెందిన సంజన లూనావత్‌ ఈనెల 15న నగరంలో జైన సాధ్విగా దీక్ష స్వీకరించనున్నారు. ఎంబీఏ పూర్తి చేసి, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, బొటిక్‌ యజమానిగా కొనసాగుతున్న 25 ఏళ్ల సంజన ప్రాపంచిక జీవితాన్ని త్యజించనున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 14న నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని తెలుగు లలిత కళాతోరణం నుంచి భారీ శోభాయాత్ర జరుగుతుందన్నారు. డీజీపీ సీవీ ఆనంద్‌, డీజీపీ ( శాంతిభద్రతలు) మహేష్‌ భగవత్‌, నగర పోలీస్‌ కమీషనర్‌ వీసీ సజ్జనార్‌ హాజరవుతారన్నారు. ఊరేగింపులో వింటేజ్‌ కార్లు, గుర్రాలు, సంప్రదాయ బ్యాండ్‌ బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. సంజన మాట్లాడుతూ... తనకు 12 ఏళ్ల వయస్సు నుంచే జైనతత్వం, బోధనల పట్ల ఆసక్తి ఏర్పడిందని తెలిపారు. జైన ధర్మంపై తన విశ్వాసం, ఆసక్తి మరింత బలపడుతూ వచ్చాయని అందుకే సాధ్వి జీవితాన్ని స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు. సంఘం అధ్యక్షుడు అన్నరాజ్‌ బఫ్నా, దీక్ష మహోత్సవం ప్లానింగ్‌ కన్వీనర్‌ మనోజ్‌ కోఠారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement