కేశంపేట: సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికల నిర్వహణలో జాప్యం కొనసాగుతోంది. అక్టోబర్ 4న నిర్వహించాల్సిన ఎలక్షన్ చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక పోలింగ్ నిలిచిపోవడంతో సభ్యులు నిరాశకు గురయ్యారు. దీంతో ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారనే అంశంపై సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది.
అర్ధంతరంగా ఆగిన ఎన్నికలు
అక్టోబర్ 4న జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలతో పాటు ఇతర ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అక్టోబర్ 3న సాయంత్రం 4గంటలకు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ అదేశాలు జారీ చేశారు. దీంతో ఎలక్షన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆరోజు నుంచి దీనిపై స్పష్టత లేకపోవడంతో సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల వాయిదాకు కారణాలను సంబంధిత అధికారులు స్పష్టంగా వెల్లడించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఏమైనా అభ్యంతరాలు లేదా చట్టపరమైన ఇబ్బందులు ఉంటే త్వరగా పరిష్కరించి, ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నారు. ఎన్నికల నిర్వహణకు కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కొత్త షెడ్యూల్ వచ్చేనా..?
అక్టోబర్ 4న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడటంతో మళ్లీ కొత్త షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలని సభ్యులు కోరుతున్నారు. ఈవిషయమై పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం కనిపించడం లేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో మరింత జాప్యం జరగకుండా చూడాలని కోరుతున్నారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేసే రెడ్‌క్రాస్ వంటి సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగి, సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా కొత్త పాలకవర్గం ఏర్పడాలని ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లా శాఖ లేకపోవడంతో అనేక సేవా కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టతనిస్తూ సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు.
చివరి నిమిషంలో వాయిదా పడిన ఎలక్షన్
కొత్త షెడ్యూల్ కోసం సభ్యుల ఎదురుచూపు
కార్యవర్గం లేక నిలిచిపోతున్న సేవా కార్యక్రమాలు


