జోరుగా ఇసుక అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

జోరుగా ఇసుక అక్రమ రవాణా

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

● ఈసీ వాగు నుంచి యథేచ్ఛగా తరలింపు

● ట్రాక్టర్‌కు రూ.4వేల నుంచి

రూ.6వేల వరకు విక్రయం

● దర్జాగా సొమ్ము చేసుకుంటున్న

అక్రమార్కులు

● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న

అధికారులు

షాబాద్‌: ఈసీ వాగు నుంచి ఇసుక దందా జోరుగా సాగుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. రాత్రిపూట అక్రమంగా రవాణా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మండలంలోని నాగర్‌గూడ, తిమ్మారెడ్డిగూడ, ఏట్ల ఎర్రవల్లి, తాళ్లపల్లి, చందనవెల్లి, రుద్రారం, హైతాబాద్‌, సోలీపేట్‌ తదితర గ్రామాల మీదుగా ఈసీ వాగు ప్రవహిస్తోంది. అక్రమార్కులు అనుమతి లేకుండా వాగు నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు, జేసీబీల సాయంతో ట్రాక్టర్‌ ఇసుక రూ.4వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుడండంతో వాగులో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. చుట్టు పక్కల మండలాలకు సైతం వ్యాపారులు ట్రాక్టర్ల ద్వారా ఇసుక చేరవేస్తూ క్యాష్‌ చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులకు సైతం ఇసుక, మట్టిని తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా వ్యాపారులు మాత్రం ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. దీంతో బోరుబావులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

కళ్లముందే తరలిస్తున్నా..

ఇసుక రవాణా జోరుగా సాగుతున్నా.. కళ్ల ముందు నుంచే ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరైనా అధికారులను ప్రశ్నిస్తే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, తమ దృష్టికి రానప్పుడు ఏం చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

ఈసీ వాగు నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై నిఘూ ఉంచి కేసులు నమోదు చేస్తాం. ఏ గ్రామంలోనైనా వాగుల్లో నుంచి తరలిస్తే సమాచారం అందించండి. వాహనాలను సీజ్‌ చేసి, వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.

– లక్ష్మిరెడ్డి, సీఐ షాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement