సాక్షి, రంగారెడ్డి జిల్లా: అనుమతి లేకుండా పార్టీలు నిర్వహిస్తున్న ఫామ్‌హౌస్‌లపై చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన 26 లీటర్ల మద్యం, నాలుగు హుక్కా పాట్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సురంగల్, తోలుకట్టలోని వన్ వ్యూ, వనం, ప్రణవిల్లా, జెడ్, రాయల్ వుడ్ ఫామ్‌హౌస్‌ల్లో అనుమతి లేకుండా పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. వాటిపై దాడులు చేసి, అక్రమంగా నిల్వ చేసిన మద్యం, హుక్కా పాట్స్‌ని స్వాధీనం చేసుకొని, యజమానులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫామ్‌హౌస్ నిర్వాహకులు నడుచుకోవాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ మల్లికార్జున్ రెడ్డి, డీఐ ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
చేవెళ్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు
చేవెళ్ల: మండలంలోని పలు ఫామ్‌హౌస్‌ల్లో ఐదు ప్రత్యేక బృందాలతో శనివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలైట్ ఫామ్‌హౌస్‌లో అనుమతులు లేకుండా హుక్కా వినియోగిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు. రెండు హుక్కాపాట్స్, వాటి పైపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల సీఐ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, శాంతిభద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు ఫామ్‌హౌస్‌ల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఫామ్‌హౌస్ యజమానులు, నిర్వాహకులు ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.


