మొయినాబాద్: ఎదురెదురుగా కారు, బైకు ఢీకొని రోడ్డు నిర్మాణంకోసం తీసిన కాలువలో పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేతిరెడ్డిపల్లి గేటు వద్ద హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం నుంచి చేవెళ్ల వైపు బైక్‌పై ఇద్దరు వెళ్తున్నారు. అదే సమయంలో చేవెళ్ల నుంచి నగరం వైపు అతివేగంతో వచ్చిన కారు, బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కింద పడి గాయాలయ్యాయి. ఢీకొన్న రెండు వాహనాలు రోడ్డు నిర్మాణంకోసం తవ్విన కాలువలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టాయి. గాయాలైన ఇద్దరిని స్థానికులు చికిత్సకోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయాలైనవారి వివరాలను మాత్రం శనివారం రాత్రి వరకు సేకరించలేదు. మరోవైపు హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డు విస్తరణ పనుల్లో కాంట్రాక్టర్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించడంలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఉన్న రోడ్డు పక్కనుంచి కొత్త రోడ్డు నిర్మాణంకోసం కాలువలు తవ్వారు. వాటికి అడ్డంగా సూచిక బోర్డులు, సిమెంటు దిమ్మెలు పెట్టాల్సి ఉన్నా.. అవేమీ పట్టించుకోవడంలేదు. దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు.
కాలువలో పడిన కారు, బైకు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు


