సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం ● పది గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా ● మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది చీఫ్‌ విప్‌తో కాంగ్రెస్‌ అసంతృప్తుల భేటీ వేగంగా వెళ్తున్న కారు టాప్‌పై కూర్చొని..

● పది గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా ● మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

కొడంగల్‌: పట్టణంలోని సబ్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఆయిల్‌ లీక్‌ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. లీకేజీ విషయం కింది స్థాయి సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోలేదని సమాచారం. ఉదయం 8 గంటల సమయంలో సబ్‌స్టేషన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు పరిసర వాసులు తెలిపారు. పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కొడంగల్‌లో సాయంత్రం ఆరుగంటలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

బషీరాబాద్‌: తాండూరు కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మధ్య విభేదాల నేపథ్యంలో.. ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్‌ నేతలు శుక్రవారం రాత్రి బషీరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసంలో మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం జరుగుతోందని, మొదటి నుంచి కాంగ్రెస్‌ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని నారాయణరావు ప్రస్తావించినట్లు తెలిసింది. అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి తాండూరు కాంగ్రెస్‌ ఇన్‌చార్జి బాధ్యతలను మహేందర్‌రెడ్డికి అప్పగించాలని కోరుతామని చెప్పినట్లు సమాచారం. అందరినీ కలుపుకొని వెళ్లే నాయకత్వం అవసరమని, మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తామంతా అండగా నిలిచి గెలిపించేందుకు కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. భవిష్యత్తులో తమకు అండగా ఉండాలని కోరినట్లు సమాచారం. దీనిపై మహేందర్‌రెడ్డి స్పందిస్తూ.. నాయకులందరికీ అన్ని విషయాల్లో అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చినట్లు భేటీలో పాల్గొన్న నేతలు తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాకేశ్‌ మహరాజ్‌, నాయకులు మాధవరెడ్డి, వెంకట్‌రామ్‌రెడ్డి, వెంకటేశ్‌ మహరాజ్‌, రోహివత్‌ మహరాజ్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, రాంనాయక్‌, నర్సిరెడ్డి, పవన్‌ ఠాకూర్‌, సిద్ధార్థ్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిగి: ట్రాఫిక్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆకతాయిలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గురువారం రాత్రి పరిగి పట్టణంలో ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న కారు టాప్‌పై కూర్చొని ప్రమాదకర విన్యాసాలు చేశాడు. ఈ వీడియో శుక్రవారం సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. పట్టణ పరిధిలోని బీజాపూర్‌ – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కొందరు వ్యక్తులు వేగంగా కారు నడిపారు. ఓ వ్యక్తి కారు టాప్‌పై కూర్చుని చల్‌చల్‌ చేశారు. తోటి వాహనదారులను భయాందోళనకు గురి చేశారు. ఇలాంటి వ్యక్తుల కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరు కారు టాప్‌పై కూర్చొని మరో ముగ్గురు లోపల ఉన్నట్ల తెలిసింది. మద్యం మత్తులో కారు నడిపారని స్థానికులు ఆరోపించారు. ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఎస్‌ఐ మోహనకృష్ణను వివరణ కోరగా వాహనాన్ని గుర్తించామని కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement