ఇబ్రహీంపట్నం రూరల్: అదృశ్యమైన యువకుడు చెరువులో శవమై తేలాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. ఇంజాపూర్ సుందరయ్య కాలనీకి చెందిన గుర్రం రాము (26) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్యతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల 21న తల్లి వద్దకు వచ్చి విషయం చెప్పి వెళ్లిపోయాడు. అదేరోజు మధ్యాహ్నం 3.20 గంటలకు తాను చనిపోతున్నట్లు వాట్సాప్ వీడియోకాల్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం రాము మృతదేహం తుర్కయంజాల్ చెరువులో లభ్యమైంది. చేతిపై ఉన్న టాటు ఆధారంగా మృతదేహం రాముదిగా గుర్తించారు. వీడియోకాల్ చేసిన రోజే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో గ్రామ కార్యదర్శికి గాయాలయ్యాయి. వివరాలివీ.. తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న వాజిద్ ఆమనగల్లులో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం ఉదయం బైక్‌పై వెల్జాల వెళ్తుండగా చింతలపల్లి గ్రామం దాటిన తరువాత పలుగుగుట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజిద్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం వెల్దండలోని ఎన్నం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
బషీరాబాద్: అధికార పార్టీలో అసంతృప్త జ్వాలను చల్లాచర్చేందుకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. అలకబూనిన మండల సీనియర్లకు శుక్రవారం ఫోన్లు చేసి శనివారం హైదరాబాద్ రావాలని సూచించినట్లు తెలిసింది. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో అధికార పార్టీలో అసంతృప్త జ్వాల శీర్షికన ప్రచురితమైన కథనం సామాజిక మాద్యమాల్లో కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రంగంలోకి దిగి అందరితో మాట్లాడారు. తమకు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆహ్వానించింది వాస్తవమేనని అసంతృప్త సీనియర్ నేత ఒకరు ధ్రువీకరించారు. అయితే వీరంతా నేడు హైదరాబాద్‌లో జరిగే ఎమ్మెల్యేతో భేటీకి హాజరు అవుతారా..? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
రాజేంద్రనగర్: అక్రమంగా బాణసంచా తయారు చేయడంతో పాటు నిల్వచేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్ బాబానగర్‌కు చెందిన జరీనా సుల్తానా, మొహమ్మద్ అజార్ ముడి సరుకును నిల్వ చేయడంతో పాటు బాణసంచా తయారు చేస్తున్నారు. శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గోదాంపై దాడి చేసి పొటాషియం పొడితో పాటు బాణసంచాకు ఉపయోగించే మసాలా పొడి, లూజ్ బాణాసంచులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. మైలార్‌దేవ్‌పల్లి బాబుల్ రెడ్డి నగర్‌లోని శక్తి ట్రేడర్స్ హోల్‌సేల్ బాణాసంచా దుకాణంపైనా దాడి చేశారు. భద్రత ప్రమాణాలు పాటించకుండా అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచి విక్రయిస్తున్న నిర్వాహకుడు హఫీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.


