● మారణాయుధాలతో దాడులు
● ఓ యువకుడి పరిస్థితి విషమం
షాబాద్: కూర్చొని మాట్లాడుకుందామని.. ఒక ఒప్పందానికి వద్దామని సామరస్యంగా జరుగుతున్న సమావేశం కాస్తా గొడవకు దారితీసింది. కత్తులు దూసుకునేవరకు వెళ్లింది. ఓ యువకుడి పరిస్థితి విషమంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని హైతాబాద్‌లో ఉన్న ఓ ప్రార్థనామందిరం వెనకాల మహమ్మద్ రహీం అనే వ్యక్తి తన పొలంలో ఏళ్ల క్రితం వెంచర్ చేశాడు. ప్రమాదవశాత్తు అతడు మృతి చెందాడు. వెంచర్‌లో హైదరాబాద్‌కు చెందిన చాంద్‌పాషా ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. రహీం సోదరులు, ఇదే వెంచర్‌లో స్థలం కొనుగోలు చేసిన సాబేర్‌తో పాటు మరికొందరు కలిసి వెంచర్ విషయమై కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్లాట్ల పంచాయితీపై మాట్లాడుకుందామని ఇరువర్గాలు నిర్ణయించుకున్నాయి. శుక్రవారం రాత్రి సాబేర్ తన అనుచరులతో హైతాబాద్‌కు వచ్చారు. స్థానిక ప్రార్థనామందిరంలో సమావేశమై మాట్లాడుకుంటుండగా మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. సాబేర్ అనుచరులు మారణాయుధాలతో హల్‌చల్ చేశారు. గొడవను ఆపడానికి వెళ్లిన నదీమ్ అనే వ్యక్తిని సాబేర్ అనుచరుడు పొట్టలో పొడిచాడు. పొట్టలో కత్తి ఇరుక్కుపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. నదీమ్‌ను వెంటనే చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి వెంటనే తన అనుచరులతో కలిసి హైతాబాద్ చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. పచ్చని పల్లెలో ఇలాంటి దుశ్చర్య జరగడం ఇదే మొదటిసారి అని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులను ఏమీ అనడం లేదని హైతాబాద్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. సీఐ లక్ష్మిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.


