మంచాల: ఫుడ్ డెలివరీ ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న యువకులను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరకు ప్రాంతానికి చెందిన ప్రదీప్, గద్వాల్ జిల్లా అయిజ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన గడుమూర్ సుకేష్ బాబు (28), గద్వాల్ జిల్లా రాజోలి మండలం మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన గంపటపోగు రవి (29) గంజాయి వంటి మత్తు పదార్థాలను అనుమానం రాకుండా ఫుడ్ డెలివరీ మాదిరిగా గ్రామాలకు నేరుగా చేరవేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టి శుక్రవారం వారిని మంచాల మండలం ఆగాపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పట్టుకున్నారు. వారి నుంచి 1.1 కిలోల ఎండు గంజాయి, మోటార్ సైకిల్, వేయింగ్ మిషన్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గడుమూర్ సుకేష్ బాబు, గంపటపోగు రవి పోలీసుల అదుపులో ఉండగా, ప్రధాన నిందితుడు ప్రదీప్ పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసును మంచాల పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
గుట్టు రట్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు


