ఇబ్రహీంపట్నంరూరల్: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావడం లేదని మనోవేదనకు గురైన భర్త అదృశ్యమయ్యాడు. ఆదిభట్ల సీఐ రమేశ్ కథనం ప్రకారం.. ఇంజాపూర్ సుందరయ్య కాలనీకి చెందిన గుర్రం రాములు(26) ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో ఇటీవల ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల 21న ఈ విషయాన్ని తల్లితో చెప్పిన రాములు కనిపించకుండాపోయాడు. అదే రోజు మధ్యాహ్నం 3:20 నిమిషాలకు తాను చనిపోతున్నానంటూ ఫ్యామిలో గ్రూప్‌నకు వాట్సాప్ వీడియో కాల్ చేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తుర్కయంజాల్ సమీపంలో ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
మీర్‌పేట: పోక్సో కేసులో నిందితుడికి కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శోభన్ కథనం ప్రకారం.. బడంగ్‌పేట సాయినగర్ కాలనీ ఫేజ్– 2కు చెందిన ముడావత్ అనిల్ (23) వృత్తిరీత్యా కూలీ. ఇదే ప్రాంతానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి నిందితుడు అనిల్‌కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధించడంతో పాటు బాధిత బాలిక కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందజేయాలని తీర్పునిచ్చారు.
యాచారం: రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి టిప్పర్లు నడుస్తున్నాయని, దీంతో రాత్రి పూట నిద్ర పట్టడం లేదని గ్రామస్తులను మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం రాత్రి వాహనాలను అడ్డుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం మర్లకుంట తండా మీదుగా కాంట్రాక్టర్లు టిప్పర్లల్లో మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు గిరిజన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వీరినుంచి స్పందన లేకపోవడంతో టిప్పర్లను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను అడ్డుకున్న పలువురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని లక్ష్మీ పుష్కరిణిలో పడి చిన్నారి మృతిచెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ గురువారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ తన కుటుంబ సభ్యులు, ముగ్గురు కుమార్తెలతో కలిసి బుధవారం సాయంత్రం యాదగిరీశుడి దర్శనానికి వచ్చారు. కొండ కింద లక్ష్మీ పుష్కరిణి వద్ద స్నానాలు చేస్తుండగా.. చిన్న కుమార్తె ఆధ్యంత(4) ఆడుకుంటూ వెళ్లి పుష్కరిణిలో పడిపోయిందని సీఐ తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారని సీఐ పేర్కొన్నారు. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


