రైతును కాపాడుదాం | - | Sakshi
Sakshi News home page

రైతును కాపాడుదాం

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

నేటి నుంచి ‘కేతీ బచావో’పై అవగాహన కార్యక్రమాలు ఎల్‌నినోను కలిసికట్టుగా ఎదుర్కొందాం రాష్ట్రంతో పోలిస్తే జిల్లాలో 10శాతం అధిక లోటు వర్షపాతం వరి సాగు చేయకపోవడమే మంచిది ఆరుతడి పంటలు మేలు కలెక్టర్‌ దీపక్‌ తివారి

వికారాబాద్‌: ‘ఇతర జిల్లాలతో పోలీస్తే మనజిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది.. వాతావరణ, భూగర్భ జలవనరులు, వ్యవసాయ, ఉద్యానశాఖల నిపుణుల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. దీన్ని దృష్టిలో ఉంచుకుని అందరం కలిసికట్టుగా ఎల్‌నినోను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది’ అని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. జిల్లాలో వర్షపాతం.. భూగర్భ జలాలు.. ఎండల తీవ్రత.. నీటి లభ్యత.. పంటలు.. పశు సంపదను కాపాడుకోవడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జిల్లా తరఫున చేసిన సిఫారసులను బుధవారం ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.

వరి పంటపై ఒత్తిడి

ప్రస్తుత ఖరీఫ్‌ సీజనలో వేసిన పంటల్లో వరి, కంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో 20 శాతం లోటు వర్షపాతం నమోదైతే జిల్లాలో 35 శా తం లోటు ఉంది. రాష్ట్ర సగటు కంటే మన జిల్లాలో పది శాతం అధిక లోటు ఉంది. ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత పెరిగి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూగర్భజలాలు వేసవి తరహాలో పడిపోతున్నాయి. ప్రస్తుతం కొన్ని మండలాల్లో 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోయాయి. ఈ ప్రభావం ప్రజలు, పశుపక్షాదులపై పడింది. వీటితో పాటు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖలు, రైతులపై ఇంకాస్త ఎక్కువ ఉంది. ఈ పరిస్థితిల్లో మనమందరం రైతులను కాపాడుకోవడం ఎంతో అవసరం. అన్నదాతలు పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 2.19 లక్ష ల ఎకరాల్లో పత్తి, 95వేల ఎకరాల్లో కంది, 1.2లక్షల ఎకరాల్లో వరి, 35వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేశారు. మొక్కజొన్న కోత దశలో ఉన్నందున ఈ పంటపై పెద్ద ప్రభావం ఉండదు. కానీ మిగతా పంటలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. కంది, పత్తి దిగుబడి 25నుంచి 50శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. వరి పంట ప్రస్తుతం ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రైతులను అప్రమత్తం చేయాలని వ్యవసాయ, దాని అనుబంధ శాఖలకు ఆదేశాలు ఇచ్చాం. నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఎల్‌నినో కారణంగా 20 నుంచి 25శాతం వరకు వరి వాడిపోతున్నట్లు తెలుస్తోంది. పంటను కాపాడుకోవడం కోసం రైతులు రెండు శాతం యూ రియా కలుపుకొని పిచికారీ చేస్తే ప్రయోజనం.

ప్రభుత్వానికి పలు సిఫారసులు

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. హర్టీకల్చర్‌ శాఖ ద్వారా ప్రభుత్వం స్ప్రింక్లర్లు, డ్రిప్‌ పరికరాలు, విత్తనాలపై రాయితీలు ఇస్తోంది. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా తరఫున ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశాం. మల్చింగ్‌ షీట్లు, డ్రిప్పు, మినీ స్ప్రింక్లర్లు, విత్తనాలు, షెడ్‌నెట్లు రాయితీపై ఇస్తే బాగుంటుందని కోరాం. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో నీటి వినియోగం, నీటి వృథాను తగ్గించుకోవాలి. వర్షపు నీరు భూమిలోకి ఇంకే కార్యక్రమాలు పెరగాలి. పంటలకు నీటి వినియోగం తగ్గించుకుని పశువులు, మనుషుల తాగునీటి అవసరాలకు తగినంత అందుబాటులో ఉంచుకోవాలి. ఎల్‌నినో ప్రభావం, దాన్ని ఎలా ఎదుర్కోవాలి.. ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. నేటి నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖలతో కలిసి కేతీ బచావో పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతోంది. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

పంట మార్పిడి అవసరం

ఖరీఫ్‌ పంటల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకుంటే 20 నుంచి 40 శాతం వరకు దిగుబడి తగ్గినా బయట పడతారు. ప్రస్తుతం రబీ సీజన్‌ ప్రారంభమైనందున పంటలసాగు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. గతేడాది రబిలో 1.85లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. ఇందులో వరి ఒక్కటే 90వేల పైచిలుకు ఎకరాల్లో వేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రబిలో వరి వేయకపోవడమే మంచిదని వ్యవసాయ, వాతావరణ శాఖల నిపుణులు సూచిస్తున్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో 30వేల ఎకరాలకు తగ్గే అవకాశం ఉంది.వరి స్థానంలో స్వల్పకాలిక ఆరుతడి పంటలువేసుకోవడం మేలు. ప్రధానంగా ఉద్యానపంటలైన కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసుకోవాలి. నీరు తక్కువ అవసరమయ్యే శనగ, జొన్న పంటలు మంచిది. వరితో పోలిస్తే ఈ పంటలకు నాలుగింతల నీరు తక్కువగా అవసరం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement