గుట్కా నములుతూ స్నాక్స్‌ తయారీ | - | Sakshi
Sakshi News home page

గుట్కా నములుతూ స్నాక్స్‌ తయారీ

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

సాక్షి సిటీబ్యూరో: నగరంలోని స్నాక్స్‌ తయారీ సంస్థ సాహిల్‌ ఫుడ్స్‌పై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ (టీజీ సేఫ్‌) అధికారులు కొరడా ఝుళిపించారు. కాటేదాన్‌ సమీపంలోని ప్రేమావతిపేటలో ఉన్న ఐదు తయారీ యూనిట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులో నమోదుకాని ఆహార కేటగిరీల ఉత్పత్తులను కూడా యూనిట్లలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఉత్పత్తి, అమ్మకాల రికార్డులు, నీటి నాణ్యత పరీక్ష , పదార్థాల పరీక్ష నివేదికలు లేకపోవడాన్ని గుర్తించారు. ఉత్పత్తులపై ముద్రించిన గడువు తేదీల విషయంలోనూ అక్రమాలు బయటపడ్డాయి. యూనిట్లలో పరిశుభ్రత ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలను నేరుగా చేతులతో నిర్వహించే కార్మికులు నోట్లో గుట్కా, పాన్‌ మసాలా నములుతూ పని చేస్తున్నట్లు గుర్తించారు.

నాలుగు యూనిట్లకు తాళం

సాహిల్‌ ఫుడ్స్‌కు చెందిన నాలుగు యూనిట్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను టీజీ సేఫ్‌ సస్పెండ్‌ చేసింది. వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కల్తీ జరిగిందన్న అనుమానంతో 11 రకాల ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపామని, వాటి ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తప్పుడు లేబులింగ్‌తో ఉన్న 55 టన్నుల ఆహార పదార్థాలను అధికారులు సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.33,94,115 ఉంటుందని అంచనా. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని, నాణ్యతలేని ఆహారాన్ని విక్రయిస్తే సహించేది లేదని కమిషనర్‌ హెచ్చరించారు.

శ్రీవారి ఆలయానికి గ్రంథం బహూకరణ

కొడంగల్‌: పట్టణంలోని శ్రీవారి ఆలయానికి బీజేపీ సీనియర్‌ నాయకుడు కరెంటు రాములు కుటుంబ సభ్యులు బుధవారం దివ్యవేద వాణి గ్రంథాన్ని బహూకరించారు. ఆలయంలో నిత్యం వేద పఠనం జరగాలని.. ఆ వాణిని ప్రజలకు వినించాలనే ఉద్దేశంతో గ్రంథం అందజేసినట్లు రాములు తెలిపారు. ఈ గ్రంథంలో నాలుగు వేదాలు ఉన్నట్లు చెప్పారు. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం తెలుగు అనువాదం ఉన్నట్లు తెలిపారు. భగవంతుని సన్నిధిలో వేద పారాయణం జరగాలనే సంకల్పంతో గ్రంథం ఇచ్చినట్లు చెప్పా రు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ కోశాధికారి మురహరి వశిష్ట, బాల ప్రకాశ్‌, కేసీ వెంకటేశ్‌, భాగ్యలత, కొంతం సత్యనారాయణ, నందారం రత్నం, మధు, గోపాల్‌ పాల్గొన్నారు.

అమ్మవారి ముక్కుపుడక రూ.1,16,116

కుల్కచర్ల: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతకు అలంకరించిన ముక్కుపుడకను నీరటి సంజీవ్‌ కుటుంబీకులు రూ.1,16,116కు దక్కించుకున్నారు. మండల కేంద్రంలోని అంగడిబజార్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద నిమజ్జన ప్రక్రియలో భాగంగా మంగళవారం వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన సంజీవ్‌ ముక్కుపుడకను దక్కించుకున్నారు. ఆయన్ను ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement