శంకర్పల్లి: ఓ కారు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తూ ముందు వెళ్తున్న మరో కారును ఢీ కొట్టిన తర్వాత అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన బుధవారం బుల్కాపూర్ కాళికామాత దేవాలయం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం పాతపల్లికి చెందిన చిన్న బాలరాజు తన గొర్రెలతో వెళ్తుండగా స్టేషన్ నాగులపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్ కారులో శంకర్పల్లి వైపు వెళ్తూ కాళికామాత ఆలయం వద్ద ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టాడు. అనంతరం కారు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టడంతో ఏడు జీవాలు అక్కడికక్కడే మృతిచెందాయి. ఘటనపై శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు.


