కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఇస్లావత్ అనుసూజ (55) ఇరవై ఏళ్ల క్రితం కుటుంబంతో వలస వచ్చి మండల కేంద్రంలో నివాసం ఉంటోంది. ఓ హోటల్లో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబానికి తోడుగా ఉంటోంది. రోజు మాదిరిగానే అనుసూజ ఆదివారం తెల్లవారుజామున హోటల్‌కు వెళ్లి జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా బస్టాండ్ సమీపంలో కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా గమనించిన స్థానికులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఇస్లావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు.


