పండుగపూటా
వికారాబాద్: తెలంగాణ పండుగ, మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే వేడుక బతుకమ్మ. ఏటా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుక పేరుతో మహిళలకు చీరలు ఇచ్చేది. రెండేళ్ల నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే ఇస్తున్నారు. ఈ సారి వారికి కూడా ఇవ్వలేదు. జిల్లాకు రెండు లక్షల చీరలు ఆర్డరు పెట్టగా సగం కూడా రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం మంచిది కాదని భావించిన అధికారులు పండుగ తర్వాత పంపిణీ చేయాలని నిర్ణయించారు. చీరలన్నీ యూనిఫామ్‌లా ఒకే రంగులో ఉండటం విమర్శలకు తావిస్తోంది. గతేడాది పాలపిట్ట రంగులో పంపిణీ చేయగా.. ఈ సారి చిలకపచ్చ రంగులో ఉన్నాయి. గత ఏడాది కూడా పండుగ తర్వాతే పంపిణీ చేశారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన చీరలను గోదాముల్లో భద్రపరిచారు. పూర్తిస్థాయిలో రాకపోవడంతో పంపిణీ తేదీని ఖరారు చేయలేదు.
జిల్లాలో 3,54,912 మంది మహిళలు
ఓటరు జాబితా ఆధారంగా జిల్లాలో 3,54,912 మంది మహిళలు ఉన్నారు. వీరిలో కొందరు చీరలు తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఏటా చాలా వరకు మిగిలిపోతున్నాయి. దీంతో 2,73,000 చీరలు సరిపోతాయని అధికారులు భావించి ఆ మేరకే ఆర్డరు ఇస్తున్నారు. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించడంతో ఇండెంట్ తక్కువ చేశారు. రెండు లక్షల చీరలు ఆర్డరు ఇచ్చారు. వికారాబాద్ నియోజకవర్గానికి 59,443, పరిగికి 48,028, తాండూరుకు 56,198, కొడంగల్‌కు 34,718 చీరలు ఆర్డురు పెట్టారు. అయితే ఇప్పటి వరకు 85,118 మాత్రమే వచ్చాయి. వాటిని ఆయా కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచారు. మరో 1,14,882 రావాల్సి ఉంది. సీ్త్ర శక్తి లోగోతో ముంద్రించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందని బతుకమ్మ కానుక
కావాల్సిన చీరలు 2లక్షలు
వికారాబాద్ జిల్లాకు చేరింది 85,118
ఇంకా రావాల్సినవి 1,14,882
యూనిఫామ్‌లా ఒకే రంగులో..


