ఖాతాల ద్వారా ఈ–కేటుగాళ్లకు సహకారం | - | Sakshi
Sakshi News home page

ఖాతాల ద్వారా ఈ–కేటుగాళ్లకు సహకారం

Oct 19 2026 7:53 AM | Updated on Oct 19 2026 7:53 AM

సాక్షి, సిటీబ్యూరో: డిజిటల్‌ అరెస్టు పేరుతో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న బెంగళూరు వ్యక్తికి సహకరిస్తున్న ఇద్దరు నగర వ్యాపారులను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మ్యూల్‌ ఖాతాలు అందించిన ఈ ద్వయం వాటిలో డిపాజిట్‌ అయిన నగదును సూత్రధారికి చేర్చేదని అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు ఆదివారం వెల్లడించారు. పరారీలో ఉన్న ప్రధాన మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వాట్సాప్‌ ద్వారా ఏర్పడిన పరిచయం...

అమీర్‌పేట ప్రాంతానికి చెందిన హమ్మద్‌ అష్ఫాక్‌ హుస్సేన్‌, అహ్మద్‌ నజీబ్‌ ఉద్దీన్‌ చిన్న వ్యాపారులు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో హుస్సేన్‌కు వాట్సాప్‌ ద్వారా బెంగళూరుకు చెందిన సచిన్‌తో పరిచయమైంది. డిజిటల్‌ అరెస్ట్‌ నేరాలు ద్వారా బాధితుల నుంచి సేకరించిన డబ్బును వివిధ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఆ లావాదేవీల ఆనవాళ్లను దాచిపెట్టేందుకు సచిన్‌ ఓ పథకాన్ని రూపొందించాడు. బాధితులు ఓ ఖాతాలో డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేయించి, క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్ల ద్వారా మరో ఖాతాలో జమ చేయిస్తే పోలీసుల దర్యాప్తు కష్టసాధ్యం అవుతుందని నిర్ణయించారు.

హుస్సేన్‌ ద్వారా రంగంలోకి నజీబ్‌...

ఈ విషయన్ని ముస్సేన్‌కు చెప్పిన సచిన్‌ అందుకు సహకరించాలని, ప్రతిఫలంగా కమీషన్‌ ఇస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించిన అతగాడు నజీబ్‌ నుంచి బ్యాంకు ఖాతాలు (మ్యూల్‌ అకౌంట్స్‌) సేకరించి ఆ వివరాలు సచిన్‌కు పంపాడు. సైబర్‌ మోసాల ద్వారా పొందిన డబ్బును సచిన్‌ ఈ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసేవాడు. ఆ తర్వాత నగర ద్వయం ఆ డబ్బును చెక్కుల ద్వారా విత్‌డ్రా చేసేవారు. ఆ మొత్తంలో తమ కమీషన్‌ మినహాయించుకుని మిగిలింది సచిన్‌ సూచించిన వివిధ బ్యాంకు ఖాతాల్లో క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్ల ద్వారా జమ చేసేవారు. ఈ డబ్బుతో క్రిప్టోకరెన్సీ కొనుగోలు చేసే సచిన్‌ ఆపై దాన్ని ఆన్‌లైన్‌లో సాధారణ కరెన్సీగా మార్పిడి చేసుకునే వాడు.

మాజీ ప్రభుత్వ ఉద్యోగి కేసుతో...

నగరానికి చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి (63) గత ఏడాది మార్చి 3న సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫోన్‌ వచ్చింది. ఢిల్లీ పోలీసు, సీబీఐ, ఈడీ పేర్లు చెప్పిన కేటుగాళ్లు రూ.6.8 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రమేయమని భయపెట్టారు. ఆపై డిజిటల్‌ అరెస్టు చేస్తున్నట్లు భయపెట్టి రకరకాల పేర్లతో బాధితుడి నుంచి రూ.29.17 లక్షలు స్వాహా చేశారు. దీనిపై సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో నమోదైన కేసును ఏసీపీ ఆర్‌జీ శివమారుతి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ కె.నారాయణరెడ్డి దర్యాప్తు చేశారు. నగదు లావాదేవీలకు వినియోగించిన బ్యాంకు ఖాతాల ఆధారంగా ఇద్దరు నగరవాసుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సచిన్‌ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరిపై దేశ వ్యాప్తంగా 16 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.

వాటిలో పడిన నగదు సూత్రధారులకు చేరవేత

ప్రతిఫలంగా కమీషన్‌ రూపంలో భారీ మొత్తం

ఇద్దరు నగర వ్యాపారులకు చెక్‌ చెప్పిన పోలీసులు

పరారీలో ఉన్న బెంగళూరు వ్యక్తి కోసం గాలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement