● కమీషన్ల పేరుతో కాజేసిన నిందితులు
● ముఠాగుట్టు రట్టు చేసిన పోలీసులు
కందుకూరు: విల్లాలో నివసించే సీనియర్ సిటిజన్స్‌కు కమీషన్లపై అధిక రుణాలు ఇప్పిస్తామని, మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం మహేశ్వరం మండలం తుమ్మలూరు సమీపంలోని మ్యాక్ ప్రాజెక్టు విల్లా, ప్రజయ్ విల్లాల్లో నివసించే సీనియర్ సిటిజన్స్‌ను లక్ష్యంగా చేసుకొని హైదరాబాద్ ఆసిఫ్‌నగర్, అత్తాపూర్‌కు చెందిన షమీనా బేగం, ఫాతిమా, మహ్మద్ కలిసి రూ.10 లక్షల కమీషన్ ఇస్తే రూ.కోటి రుణం, రూ.20 లక్షలు ఇస్తే రూ.2 కోట్ల రుణం ఇప్పిస్తామని, మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మబలికారు. వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారు. ఇచ్చిన నోట్లలో ఫేక్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసి మరిన్ని వసూలు చేశారు. బంగారం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, లంచం ఇస్తే బయటకు వస్తుందని మాయమాటలు చెప్పి మరోసారి వసూలు చేశారు. పలుమార్లు బాధితులు నిలదీయగా కాలయాపన చేయడంతో పాటు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కి గురి చేయడం ప్రారంభించారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఈనెల 9న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షమీనా బేగం, ఫాతిమా, మహ్మద్‌ను అత్తాపూర్‌లో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల నుంచి సుమారు రూ.35 లక్షల నగదు, సెల్‌ఫోన్, ఆటో స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐలు, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు.


