మహిళను కాపాడినందుకు పోలీసుల సన్మానం
కొందుర్గు: రోడ్డుపై ఏవైనా సంఘటనలు జరుగుతుంటే తమకెందుకులే అని చూసీచూడనట్లు వెళ్లేవారు ఎందరో. కానీ ఓ వ్యక్తి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు గమనించి ఆమెను కాపాడాడు. ఎస్‌ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ శుక్రవారం రాత్రి కొందుర్గు బస్టాండ్‌లో బస్సుకోసం వేచిఉండగా చెర్కుపల్లి గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మధు (19) తానూ అక్కడికే వెళ్తున్నానని, లిఫ్ట్ ఇస్తానని తన మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న కొందుర్గుకు చెందిన ఉమర్ పరిస్థితిని గమనించి ప్రశ్నించగా అతడు తన వాహనం తీసుకొని పారిపోయాడు. అనంతరం ఉమర్ మహిళను కొందుర్గు పోలీస్టేషన్ తీసుకెళ్లి జరిగిన విషయం తెలిపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఉమర్‌ను శాలువాతో సత్కరించారు.


