సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని అమీర్‌పేట్‌లో విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలను శనివారం ఆమె పరిశీలించారు. రైతులు, విద్యుత్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంపై మార్చి నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కరెంట్ కోతలు, భూగర్భ జలాలు అడుగంటడంతో చేతికివచ్చిన పంటలు ఎండిపోయి పశువులకు మేతగా మారా యని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ సక్రమంగా లేక మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసి కంటికిరెప్పలా చూసుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం 10 గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతు భరోసా నిధులు సక్రమంగా విడుదల చేయడం లేదని, ఎన్నికల్లో కౌలు రైతులకు భరోసా నిధులు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వకుండా మాట తప్పారని దుయ్యబట్టారు. నాణ్యతతో కూడిన విద్యుత్ అందించాలని మండల ఏఈ చక్రపాణికి సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ పోతుల మల్లమ్మ, ఉప సర్పంచ్ చేగురి చంద్రకళ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుమారి రాయప్ప, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


