కొత్తూరు: మండలంలోని తీగాపూర్‌లో ఉన్న ఓ వెంచర్‌లో ఈ నెల 14న చోటు చేసుకున్న యువకుడి దారుణ హత్య కేసును కొత్తూరు పోలీసులు ఛేదించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏసీపీ లక్ష్మీనారాయణ వివరాలు వివరించారు. నందిగామ మండలం అంతిరెడ్డిగూడ పంచాయతీ పృథ్వీకాలనీలో నివసించే బొడికే ప్రేమ్‌కుమార్(18) స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడికి ప్రస్తుతం పృథ్వీ కాలనీలో నివాసం ఉంటున్న హైదరాబాద్ బహదూర్‌పురకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ (20)తో పరిచయమైంది. ప్రేమ్‌కుమార్ తన అవసరాల నిమిత్తం ఇర్ఫాన్ దగ్గర ఇటీవల రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని కోరగా ఇవ్వకపోవడంతో అంతమొందించాలని నిర్ణయించుకుని మైలర్‌దేవ్‌పల్లికి చెందిన తన స్నేహితుడు మహ్మద్ నవాజుద్దీన్(23) సహాయం తీసుకున్నాడు. పథకంలో భాగంగా ఇద్దరూ కలిసి ఈ నెల 14న ప్రేమ్‌కుమార్‌ను తీగాపూర్ శివారులోని ఓ వెంచర్‌లో మందు తాగడానికి తీసుకెళ్లారు. అక్కడ డబ్బుల విషయంలో ఘర్షణ చోటు చేసుకోగా ఇర్ఫాన్ కత్తితో ప్రేమ్‌కుమార్‌పై దాడి చేయగా నవాజుద్దీన్ సాయం చేశాడు. తీవ్ర గాయాలతో ప్రేమ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సెల్‌ఫోన్ ఆధారంగా మృతుడి తల్లి బొడికే లలితకు సమాచారం ఇవ్వగా ఆమె తన కుమారుడిగా గుర్తించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న తిమ్మాపూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇర్ఫాన్, నవాజుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా ఇర్ఫాన్‌పై ఇదివరకే బహదూర్‌పురలో ఒక కేసు, షాద్‌నగర్‌లో రెండు, కొత్తూరులో మరో కేసు నమోదై ఉన్నట్లు తేలింది. హత్యకేసును ఛేదించిన సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐలు గోపాలకృష్ణ, సత్యశీలారెడ్డి, ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
యువకుడి హత్యకేసును
ఛేదించిన పోలీసులు


