అవకతవకలు సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

అవకతవకలు సహించేది లేదు

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

అవకతవకలు సహించేది లేదు

ఇబ్రహీంపట్నం రూరల్‌: రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా, సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) సేకరణలో అవకతవకలను అరికట్టడమే లక్ష్యమని సివిల్‌ సప్లై విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ కె.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టీఫెర్‌ రవీంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని బొంగ్లూర్‌ సమీపంలో ఉన్న జయలక్ష్మి రైస్‌మిల్లులో దాడులు నిర్వహించారు. పోచారం సమీపంలో ఉన్న గోదాంలో సైతం సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రామ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో సుమారు మూడువేల రైస్‌ మిల్లుల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా జయలక్ష్మి రైస్‌మిల్లులో దాడులు చేయడం జరిగిందన్నారు. మిల్లులోని రికార్డులు, ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యం నిల్వలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. స్టాక్‌ రిజిస్టర్లకు, క్షేత్ర స్థాయిలో ఉన్న ధాన్యానికి భారీ తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్‌ చేసి ప్రభుత్వానికి బియ్యంగా అందించకుండా కొందరూ మిల్లు యజమానులు అక్రమంగా ప్రైవేటు మార్కెట్‌లో విక్రయిస్తూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి పట్టించే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, పదేపదే అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆస్తులను సైతం జప్తు చేసేందుకు వెనుకాడబోమన్నారు. విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందం మూడు,నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,400 కోట్ల మొండి బకాయిలను రికవరీ చేసిందని వివరించారు. రాబోయే రోజుల్లో బకాయి ఉన్న ప్రతి రైస్‌మిల్లు నుంచి పూర్తి స్థాయిలో రికవరీ చేపడామని ఎస్పీ రామ్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ వ్యవస్థను దెబ్బతీసే ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.

సీఎంఆర్‌ సేకరణలో అక్రమాలు అరికట్టడమే లక్ష్యం

పక్కదారి పట్టించే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్‌

విజిలెన్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ రామ్‌కుమార్‌

బొంగ్లూర్‌లోని రైస్‌మిల్లులో ఆకస్మిక తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement