మొయినాబాద్: చిలుకూరుకు చెందిన శతాదిక వృద్ధుడు సదువు చంద్రయ్య(106) కన్నుమూశారు. నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు.
● తీగాపూర్ శివారులో పడిఉన్న మృతదేహం
● వివరాలు సేకరించిన పోలీసులు
కొత్తూరు: గుర్తు తెలియని యువకుడు హత్యకు గురైన సంఘటన మండలంలోని తీగాపూర్ శివారు వెంచర్‌లో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఏసీపీ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతుడి (25) గొంతు కోసి, కడుపు పలుమార్లు పొడిచినట్లు గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మృతుడు స్థానిక పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కడ్తాల్: నాలుగు ఆవులు, ఓ దూడ అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడిన ఘటన బుధవారం సాయంత్రం కడ్తాల్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిరమేశ్ తన భార్య మంగమ్మ కలిసి వ్యవసాయంతో పాటు పాడి పోషణతో జీవనం సాగిస్తున్నారు. ఉదయాన్నే పొలానికి వెళ్లి ఎనిమిది గోవులకు గడ్డి, దాణా అందించి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం పొలానికి వెళ్లగా నాలుగు ఆవులు, ఓ దూడ మృతిచెంది ఉన్నాయి. వీటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. సర్పంచ్ రాయికంటి భిక్షపతి, మాజీ ఎంపీటీసీ గురిగళ్ల లక్ష్మయ్య రైతును ఓదార్చారు.
● ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో ఘటన
● ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మృతుడు
ఇబ్రహీంపట్నం: ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బీరేంద్రకుమార్ (24) భార్య గీతతో కలిసి ఇరవై రోజుల క్రితం శేరిగూడ వచ్చి ఓ గ్లాస్ కంపెనీలో పనిచేస్తూ గ్రామంలోనే నివసిస్తున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో గీత పనికి వెళ్లగా, గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకొని ఉరి వేసుకున్నాడు. సమయం దాటినా బీరేంద్రకుమార్ విధులకు వెళ్లకపోవడంతో తోటి కార్మికులు వచ్చి చూడగా విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా, ఏడాది క్రితం బీరేంద్రకుమార్ గీతను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు జార్ఖండ్‌లో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఎంఎంసీలో నిర్మాణ వ్యర్థాల ప్లాంట్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో భవన నిర్మాణాలు, కూల్చివేతల (సీఅండ్‌డీ) నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా అడ్డుకునేందుకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌న్(ఎంఎంసీ) కీలక చర్య చేపట్టింది. రాంపల్లిలో రోజుకు 200 టన్నుల సీఅండ్‌డీ వ్యర్థాలను ప్రాసెస్ చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. స్వచ్ఛ భారత్ మిషన్‌న్–అర్బన్‌న్2.0 నిధులతో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12 కోట్లు. పీపీపీకి అర్హత సాధించే ప్రైవేటు సంస్థ ప్లాంట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 40 శాతం అంటే రూ.4.80 కోట్లను ఎంఎంసీ భరించనుంది. మిగిలిన 60 ఎంపికయ్యే ప్రైవేటు సంస్థ సమకూర్చాలి.


