ఇబ్రహీంపట్నం రూరల్: జంగం కుంటపై జగడం మొదలైంది. మంగళ్‌పల్లి రెవెన్యూలో మతలబు జరిగింది. ప్రభుత్వ భూమికి పట్టా కాగితాలు సృష్టించారు. తహసీల్దార్ ప్రమేయం లేకుండా, కలెక్టర్ డీఎస్ పెట్టకుండా పట్టాదారు పాసుపుస్తకం రావడంపై అధికారులు నోరెళ్లబెడుతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కొట్టేసేందుకు.. రికార్డుల్లో భూమిని రెండింతలు చేసి, కొత్త సర్వే నంబర్ సృష్టించి తతంగం నడిపించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి రెవెన్యూ 96సర్వే నంబర్‌లో 4.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని జంగం కుంటగా పిలుస్తారు. అనేక ఏళ్ల తరబడి రెవెన్యూ రికార్డుల్లోనూ ఇది కుంటగానే నమోదై ఉంది. ప్రస్తుతం ఈ స్థలమంతా కంప చెట్లతో నిండిపోయి, ఖాళీగా దర్శనమిస్తోంది. ఈ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఎలాగైనా దీన్ని కొట్టేయాలని పథకం వేశారు. మూడో కంటికి తెలియకుండా రికార్డులు మార్చేశారు. వహీదాబేగం పేరుతో సర్వేనంబరు 96బై 1ను సృష్టించి 4.25 ఎకరాలతో పట్టా భూమిగా మార్చారు. ఇందుకు సంబంధించిన పాసుపుస్తకం సైతం బయటకు వచ్చింది. డీఎస్‌లో సైతం వీరి పేరు కనిపించింది. కానీ సర్వే నంబరు 96 ఇప్పటికీ 22– ఏ లోనే ఉంది.
రెవెన్యూ అధికారులకు తెలియకుండా..
ధరణి, భూభారతి రావడంతో అంతా ఆన్‌లైన్, డిజిటల్ సంతకాలతో పని అయిపోతోంది. కానీ ఇక్కడ మాత్రం వహీదాబేగం అనే మహిళ పేరుతో ఒక్క నాడు కూడా మీ సేవ ద్వారా కానీ ఫిజికల్ కాపీలతో దరఖాస్తు చేసుకోలేదు. కనీసం తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫైల్ కదలలేదు. కానీ పని మాత్రం సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ వరకు అందరి సంతకాలు పూర్తయ్యాయి. పట్టా ఫైల్, నోట్ ఫైల్, రికార్డు మార్పుల వివరాలు, డిజిటల్ ఎంట్రీలు ఎక్కడా జరగలేదని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ భూమి పట్టాగా మారడం అంత సులభం కాదని, ప్రక్రియ ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదని పేర్కొంటున్నారు. పాత పహణీలు, సెత్‌వార్, వన్‌బీ, ఆర్‌ఓఆర్ రికార్డులు, మ్యూటేషన్ చరిత్ర ఎక్కడ లేదు. ఆ పేరుతో పూర్వాపరాలు లేవని చెబుతున్నారు.
ప్రభుత్వ భూమి స్వాధీనం
సర్వే నంబరు 96లోని 4.25 ఎకరాల ప్రభుత్వ భూమితో వహీదాబేగంకు సంబంధం లేదని అధికారులు తేల్చారు. ప్రస్తుతం ఈ భూమిలో ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. వహీదాబేగం వివరాలను భూభారతి నుంచి తొలగించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోందని సమాచారం.
ప్రభుత్వ భూమికి పట్టా పాసుపుస్తకం
భూ భారతి రికార్డుల్లోనూ వివరాల నమోదు
సర్వేనంబర్ మార్చేసి, లేని భూమిని సృష్టించిన వైనం
రికార్డుల నుంచి తొలగింపు
ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు పాతిన అధికారులు
పట్టామార్పుపై సర్వత్రా అనుమానాలు


