కొంగరకుర్దు భూముల సమస్య పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

కొంగరకుర్దు భూముల సమస్య పరిష్కరించండి

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

కందుకూరు: వక్ఫ్‌ భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. మహేశ్వరం మండలం కొంగరకుర్దు–ఏ రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గురువారం ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డిని కలిశారు. కొంగరకుర్దు ప్రాంతంలో సుమారు 500 ఎకరాల వక్ఫ్‌ భూమి ఉందని, అందులో సర్వే నంబర్లు 85,86,88,89కు సంబంధించి దాదాపు 58 ఎకరాల భూమిపై కొందరు రియల్టర్లు అక్రమ లేఅవుట్లు వేస్తున్నారంటూ రైతులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి, వారికే తెలియకుండా లావాదేవీలు, లేఅవుట్ల ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆయా భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ లేఅవుట్లకు అనుమతులు ఎలా వచ్చాయనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని చెప్పారు. భూముల హక్కులు, రికార్డులు, అనుమతులు తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. ఆ భూములపై జారీ చేసిన పది ఓఆర్సీలపై విచారణ చేపట్టాలని, అప్పటి వరకు లేఅవుట్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను నిలిపివేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేస్తున్నట్లు తేలితే వెంటనే పనులను నిలిపివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి ఎల్మటి దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఆర్డీఓతో సమావేశమైన ఎంపీ కొండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement