‘ఫ్యూచర్‌’లోకి ఆ మూడు గ్రామాలు! | - | Sakshi
Sakshi News home page

‘ఫ్యూచర్‌’లోకి ఆ మూడు గ్రామాలు!

Jun 6 2026 9:07 AM | Updated on Jun 6 2026 9:07 AM

యాచారం: ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)లోకి యాచారం మండలంలోని మరో మూడు గ్రామాలను సైతం విలీనం చేసేందుకు సర్కార్‌ దృష్టి సారించింది. జిల్లాలోని ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్‌సిటీ నిర్మించడానికి నిర్ణయించడం తెలిసిందే. అత్యధికంగా యాచారం మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలను ఎఫ్‌సీడీఏలోకి తీసుకున్న సర్కార్‌ రంగారెడ్డి–నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న మంతన్‌గౌరెల్లి, కేసీతండా జీపీతో పాటు యాచారం–మంచాల మండలాల సరిహద్దులోని మొండిగౌరెల్లి గ్రామాన్ని విస్మరించింది. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ గ్రామాలను కూడా ఫ్యూచర్‌సిటీలో విలీనం చేయాలని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఏకగ్రీవ తీర్మానాలు ఇవ్వాలని ఆదేశాలు

యాచారం మండలంలో మొత్తం 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలోనే 17 గ్రామాలను ఎఫ్‌సీడీఏలోకి తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో టీజీఐఐసీ ద్వారా రూ.50 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నారు. ఎఫ్‌సీడీఏలోకి తీసుకోని మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, కేసీతండాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగా ఉంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సర్కార్‌ తాజాగా ఆ మూడు గ్రామాలను కూడా ఎఫ్‌సీడీఏలో విలీనం చేయాలని నిర్ణయించింది. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆయా పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఎంపీడీఓకు అందజేశారు.

మండలమంతా ఎఫ్‌సీడీఏలోకి..

మూడు గ్రామాలతో యాచారం మండలంలోని 20 రెవెన్యూ గ్రామాలతో పాటు మరో 20 అనుబంధ గ్రామాలు ఎఫ్‌సీడీఏలో చేరినట్లు అయింది. ఎఫ్‌సీడీఏ పరిధిలోకి ఆమనగల్లు మండలం నుంచి రెండు గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలం నుంచి 8, కడ్తాల్‌ మండలం నుంచి 8, కందుకూరు మండలం నుంచి 18, మహేశ్వరం మండలం నుంచి రెండు, మంచాల మండలం నుంచి మూడు, యాచారం మండలం నుంచి 17 గ్రామాలను తీసుకున్నారు. తాజాగా మూడు గ్రామాలను ఎఫ్‌సీడీఏలో విలీనం చేయడానికి సర్కార్‌ నిర్ణయించడంతో మొత్తం గ్రామాల సంఖ్య 59కి చేరనుంది.

ఎఫ్‌సీడీఏలోకి యాచారం మండలం మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, కేసీతండా

విలీనానికి ఏకగ్రీవ తీర్మానాలు ఇవ్వాలని కలెక్టర్‌ నుంచి జీపీలకు ఆదేశాలు

తీర్మానాలు చేసి ఎంపీడీఓకు అందజేసిన పాలకవర్గాలు

హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement