ఎఫ్‌సీడీఏ భవనం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీడీఏ భవనం పరిశీలన

Jun 6 2026 9:07 AM | Updated on Jun 6 2026 9:07 AM

ఎఫ్‌సీడీఏ భవనం పరిశీలన పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ఆహార పదార్థాల సరఫరాకు టెండర్‌ నోటిఫికేషన్‌ పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

కందుకూరు: ఫ్యూచర్‌ సిటీలో నిర్మించిన ఎఫ్‌సీ డీఏ భవనాన్ని శుక్రవారం మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకీరెడ్డి పరిశీలించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవం కానుంది. అందులో భాగంగా వారు ఆ భవనంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన బందోబస్తు తదితరాల గురించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వారి వెంట గ్రీన్‌ ఫార్మా సీఐ సత్యనారాయణ, కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

షాద్‌నగర్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అదనపు జిల్లా జడ్జి స్వాతిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం షాద్‌నగర్‌ కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన, హరిత వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అందరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ రోజువారీ జీవితంలో అంతర్భాగం కావాలన్నారు. గాలి, నీరు, నేల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా మానవ ఆరోగ్యాన్ని, వన్యప్రాణులను కాపాడవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కొత్త రవి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సాహితి, జడ్జి ప్రవీణ్‌కుమార్‌, ఫారెస్టు అధికారి మహ్మద్‌ అజీజ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, న్యాయవాదులు సబియా సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌రూరల్‌: గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆహార పదార్థాల సరఫరాకోసం టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగిందని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూరగాయలు, చికెట్‌, మటన్‌, కోడిగుడ్లు, కిరాణా సామగ్రి సరఫరాదారుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. టెండర్‌ ఫాం ధర రూ.20వేలు ఉంటుందని, ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ) రూ.30వేలు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈఎండీలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీ ఉంటుందని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు ఈనెల 13 చివరి తేదీ కాగా, 15న మధ్యాహ్నం 2.30 గంటలకు టెండర్లు తెరవనున్నట్టు చెప్పారు. టెండర్‌ పరిధిలో టీజీటీడబ్ల్యూఆర్‌ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల షాద్‌నగర్‌, టీజీటీడబ్ల్యూఆర్‌జే బాలుర కళాశాల ఇబ్రహీంపట్నం, టీజీటీడబ్ల్యూఆర్‌జే బాలుర కళాశాల కొత్తూరు, ఐఐటీ స్టడీ సెంటర్‌ మహేశ్వరం, టీజీటీడబ్ల్యూఆర్‌ సీఓఈ (పీవీటీజీ–జీ) హయత్‌నగర్‌, మినీ గురుకులం రంగాపూర్‌ విద్యాసంస్థలు వస్తాయని తెలిపారు.

పహాడీషరీఫ్‌: పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఎల్‌బీ నగర్‌ న్యాయస్థానం శుక్రవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇన్‌స్పెక్టర్‌ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన బాలికపై కర్నాటక రాష్ట్రానికి చెందిన రాజేంద్ర (35) 2023 ఫిబ్రవరి 13న లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసు విచారించిన ఎల్‌బీ నగర్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

Advertisement
 
Advertisement
Advertisement