ఇబ్రహీంపట్నం రూరల్: ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డితో కలిసి ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు వివరాలను పరిశీలించి, అర్హులైన ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. హేతుబద్ధీకరించిన ముసాయిదా ఓటరు జాబితాను జూలై 31న ప్రచురించనున్నట్లు చెప్పారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి, సెప్టెంబర్ 28లోపు వాటిని ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అన్నారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు సాధ్యమైనంత వరకు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు, బూత్‌స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండాలని, ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉన్నవారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మరణించిన వ్యక్తుల పేర్లు తుది జాబితాలో ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన బీఎల్‌ఓలపై చర్యలు తప్పవన్నారు. చిరునామా మార్పుల వివరాల సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఇంటింటి గణన సందర్భంగా ఫారం –6 డిక్లరేషన్ ఫారం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1950, ఓటరు పోర్టల్, ఈసీఐనెట్ యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు సరిత, జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


