హాం ఫట్‌ | - | Sakshi
Sakshi News home page

హాం ఫట్‌

Mar 16 2026 8:56 AM | Updated on Mar 16 2026 8:56 AM

బొంరాస్‌పేట: ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో అందినకాడికి ఇసుకను తోడేస్తూ అక్రమార్కులు రూ.కోట్లకు పడగలేస్తున్నారు. అప్పట్లో తుంకిమెట్ల, కొత్తూరు, ఏర్పుమళ్ల తదితర గ్రామాలు తండాల్లో పూర్తిగా ఇసుకను తోడేశారు. ప్రస్తుతం కాగ్నావాగు పరివాహక గ్రామాలు, బొంరాస్‌పేట, మహంతీపూర్‌, మద్దమడుగుతండా, దుప్‌చర్ల గ్రామాల్లోనే టిప్పర్ల కొద్దీ ఇసుకను పగలు, రాత్రి తరలిస్తున్నారు. ఇందుకు అధికారులు, నాయకులకు సైతం ముడుపులు చేరుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలనకు వచ్చిన జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల బృందం కళ్లేదుట తుంకిమెట్లలో టిప్పర్ల కొద్దీ ఇసుక డంపులున్నా పట్టించుకోలేదు. సదరు సీఐ, ఎస్‌ఐల వాహనాలు చూస్తూ వెళ్లారు. చివరకు స్థానికుల చొరవతో డంపులు సీజ్‌ చేయించారు.

సఖ్యత కరువు

సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో నియోజకవర్గానికి రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల భవనాలు, వంతెనలు, ప్రహరీలు ఇలా ప్రతి మండలంలో పనులు జరుగుతున్నాయి. కానీ మరోవైపు రెండేళ్లుగా విచ్చలవిడిగా రోజుకు 50 నుంచి 80 టిప్పర్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య పొంతన లేకపోవడంతో ఇసుక అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. పోలీసు సిబ్బందిలో ఇద్దరు ఇసుక అక్రమ రవాణాకు ఇన్‌ఫార్మర్లుగా ఉంటున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

గోరంత అనుమతి

రూ.కోట్ల నిధులతో నిర్మాణాలు చేస్తున్న బడా కాంట్రాక్టర్లు గోరంత అనుమతి తీసుకొని కొండంతగా తవ్వుకుంటున్నారు. కొడంగల్‌, పరిగి తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి తరలించిన ఇసుకను నిల్వ చేసి యథేచ్ఛగా రూ.లక్షలకు అమ్ముకుంటున్నారు. మండల కేంద్రంతోపాటు బొట్లోనితండా, మద్దిమడుగుతండా, తుంకిమెట్ల ఇసుక రవాణా కేసమే టిప్పర్లు, దుప్‌చర్ల, మహంతీపూర్‌, నాగిరెడ్డిపల్లి, తదితర గ్రామాలు తండాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మామూళ్ల మత్తులో అధికారులు మునిగి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతోపాటు మైనింగ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

బరితెగిస్తున్న ఇసుకాసురులు

నిత్యం టిప్పర్ల కొద్దీ తరలింపు

రూ.కోట్లకు పడగలెత్తుతున్న అక్రమార్కులు

పట్టించుకోని అధికార యంత్రాంగం

చర్యలు తీసుకుంటాం

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో రెవెన్యూకు పోలీసు, మైనింగ్‌ అధికారులు సహకరించాలి. రెవెన్యూ పరంగా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. డంపులు సీజ్‌ చేసి వేలం నిర్వహిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనులకు అనుమతులిస్తున్నాం. అక్రమదందా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు.

– పద్మావతి, తహసీల్దార్‌, బొంరాస్‌పేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement