అడ్డగోలు పనులకు అడ్డా | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలు పనులకు అడ్డా

Mar 16 2026 8:55 AM | Updated on Mar 16 2026 8:55 AM

సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026

వెలుగుచూస్తున్న వరుస ఘటనలు

సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
వారాంతపు విడిదికోసం అంటూ పెద్దలు నిర్మించుకున్న ఫాంహౌస్‌లు తప్పుడు పనులకు అడ్డాలుగా మారుతున్నాయి. సరదా పార్టీలు, మందు, రేవ్‌, డ్రగ్స్‌, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి గలీజు వ్యవహారాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడిచేసి గుట్టు రట్టు చేస్తున్నా అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. కొన్ని రకాల సెటిల్‌మెంట్లు, రాజకీయ నేతల రహస్య భేటీలు సైతం ఫాంహౌస్‌ల్లోనే జరుగుతుండడం విశేషం.

మొయినాబాద్‌: నగర శివారుల్లోని మొయినాబాద్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలామంది ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్‌ మండలంలో చాలా మంది 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మిస్తున్నారు. వీటిలో చాలా వరకు రాజకీయ, సినిమా, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, వీఐపీలవి ఉన్నాయి. వీకెండ్స్‌లో పిల్లలతో వచ్చి ఆనందంగా గడపడానికంటూ నిర్మించుకున్నవాటిని కొందరు ఇతరులకు లీజుకు, అద్దెకు ఇస్తున్నారు.

అడ్డగోలు దందాలు

అద్దెకు తీసుకుంటున్న నిర్వాహకులు వాటిలో అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్‌టుగెదర్‌, ఫ్యామిలీ పార్టీలు, బర్త్‌డేలకు అంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. వీటితోపాటు రేవ్‌ పార్టీలు, ముజ్రా పార్టీలు, పేకాట, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. యువకులను ఆకర్షించే విధంగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయించిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. ఫాంహౌస్‌ల్లో నిర్వహించే పార్టీల్లో అక్రమంగా మద్యం, హుక్కా, గంజాయి, డ్రగ్స్‌ వినియోగం జరుగుతోంది. కొన్నింటిలో పేకాట, కోడి పందేలు సైతం జోరుగా ఆడుతున్నారు.

ప్రముఖుల ఫాంహౌస్‌ల్లో..

శివారుల్లో ఉన్న ప్రముఖుల ఫాంహౌస్‌ల్లో తరచూ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి ఆ గుట్టును రట్టుచేశారు. తాజాగా శనివారం రాత్రి ఆయన ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతుండగా ఈగల్‌ టీం పోలీసులు అక్కడకు చేరుకోగానే గన్‌తో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇందులో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మరో తొమ్మిది మంది పట్టుబడ్డారు. నెల రోజుల క్రితం సైతం రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఓ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం తోలుకట్టలోని ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. పోలీసులు దాడి చేసి పందేలు నిర్వహించిన ఏపీ మంత్రి నారా లోకేష్‌ సన్నిహితుడు శివకుమార్‌తోపాటు 64 మందిని అరెస్టు చేశారు. 55 కార్లు, 84 కోళ్లు, రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

కొంత కాలం క్రితం కనకమామిడి రెవెన్యూ లోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

ఏడాదిన్నర క్రితం నజీబ్‌నగర్‌ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌ ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు.

రెండేళ్ల క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఏడాది క్రితం అజీజ్‌నగర్‌ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు.

పది నెలల క్రితం ఎత్‌బార్‌పల్లిలోని ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్కా పాట్స్‌, మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఫాంహౌస్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు

పెరుగుతున్న డ్రగ్స్‌, పేకాట, కోడి పందేలు, వ్యభిచారం, రేవ్‌, ముజ్రా పార్టీలు

యథేచ్ఛగా గంజాయి, హుక్కా, మద్యం వినియోగం

పోలీసులు దాడులు చేస్తున్నా ఆగని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement