ఆమనగల్లు: మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డిని శుక్రవారం ఆమనగల్లు ఠాణా ఎస్‌హెచ్‌ఓ సంద వెంకటేశ్వర్లు శుక్రవారం కలిశారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఆయన డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆమనగల్లు పట్టణంలో ప్రథమశ్రేణి న్యాయమూర్తి కాటం స్వరూపను కలిసి పూలమొక్క బహూకరించారు.
మండల విద్యాధికారిపై చర్యలకు ఫిర్యాదు
శంకర్‌పల్లి: మండల విద్యాధికారి అక్బర్‌పై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పీడీఎస్‌యూ జిల్లా నాయకులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కి ఫిర్యాదు చేశారు. అనంతరం పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ.. మండలంలోని జన్వాడ జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుడైన సయ్యద్ అక్బర్ 2015లో మండల విద్యాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఇష్టారీతినా అనుమతులు ఇస్తూ, ప్రభుత్వ విద్యా విధా నాన్ని ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలకు పదో తరగతికి అనుమతి లేకున్నప్పటికీ దాంట్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే మండల విద్యాధికారిపై తగు విచా రణ జరిపి, చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్దఎత్తున అందోళన చేపడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
రామలింగేశ్వరుడికి అడిషనల్ ఎస్పీ పూజలు
కుల్కచర్ల: బండవెల్కిచర్ల గ్రామం పాంబండ రామలింగేశ్వరునికి శుక్రవారం అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు.. అడిషనల్ ఎస్పీని సన్మానించారు. కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, అర్చకులు పాండు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
దోమ: ప్రమాదవశాత్తు చింత చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన దోమ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వసంత్ జాదవ్ వివరాల ప్రకారం.. మండల పరిధి దిర్సంపల్లి గ్రామానికి చెందిన బైండ్ల బాబు(47), ఈ నెల 10న అదే గ్రామానికి చెందిన ఖదీర్ పాష వద్దకు చింతకాయను దులిపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలోని చెట్టు ఎక్కి రాల్చేందుకు యత్నించగా.. కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ప్రాణాలు విడిచాడు. కేసు దర్యాప్తులో ఉంది.
మూసీ బాధితులపై గృహ నిర్బంధం అప్రజాస్వామికం
మానవ హక్కుల వేదిక ఆందోళన
సాక్షి, సిటీబ్యూరో: మూసీరివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే బాధితుల గొంతు నొక్కుతూ ప్రభుత్వం వారిపై గృహ నిర్బంధం విధించడం దారుణమని మానవ హక్కుల వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టు నివేదికను వెల్లడించగా, మరోవైపు మానవ హక్కుల వేదిక నగర కమిటి ఉపాధ్యక్షుడు, మూసీ, బస్తీ ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న సయ్యద్ బిలాల్ పై గృహనిర్బంధం విధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, ఉభయరాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్.జీవన్‌కుమార్, హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు. మానవ హక్కుల వేదికతో పాటు, నివాస హక్కుల సంస్థలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, బస్తీ ప్రజలు తదితర వర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తాము వ్యతిరేకించడం లేదని, ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే బాధితులకు పునరావాసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. పునరావాసం కల్పించకుండా నిరాశ్రయులను చేయడం తగదన్నారు. సామాన్య ప్రజల నివాస హక్కులను గౌరవిస్తూ మూసీ నదిని శుభ్రం చేసే ప్రాజెక్ట్ ను చేపట్టాలని, గాంధీ సరోవర్‌ను ఇదివరకే ఉన్న బాపూ ఘాట్ ప్రాంగణానికి పరిమితమై మాత్రమే నిర్మించాలని వారు కోరారు.
కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య
తాండూరు రూరల్: కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధి చెంగోల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాథోడ్ వినోద్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైండ్ల లక్ష్మి(52), వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. కొన్ని నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఇంట్లో దూలానికి తాడుతో ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కేసు దర్యాప్తులో ఉంది.


