● ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులు
● వాహనాన్ని బయటకు తీసిన పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందం
షాద్‌నగర్ రూరల్: అతివేగంగా దూసుళ్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లగా, ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లిలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలోని నలందానగర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, నరేష్ స్నేహితులు. వీరు గురువారం తమ స్నేహితుడు బండ్లగూడజాగీరు పరిధిలోని వ్యాలీ కాలనీలో నివాసం ఉంటున్న కజ్జం రమంత్‌కు చెందిన గ్రాండ్ విఠారా కారును తీసుకొని ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామానికి వచ్చి, రాత్రి హైదరాబాద్ పయనమయ్యారు. మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్‌రెడ్డి, నరేష్ కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపు తప్పి చటాన్‌పల్లి శివారులోని సురసముద్రం చెరువులోకి దూసుకెళ్లింది. కారును నిలిపే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకపోవడంతో స్నేహితులిద్దరూ కిందకు దూకేశారు. కారు పూర్తిగా చెరువులోకి దూసుకెళ్లిన తర్వాత ఇద్దరూ అక్కడనుండి వెళ్లిపోయారు. చెరువులో పడిపోయిన కారును చూసిన పలువురు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులతో శ్రమించి బయటకు తీశారు. కారు నంబర్ ఆధారంగా యజమాని వివరాలు తెలుసుకుని సమాచారం అందించారు. రమంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ మల్లిఖార్జున్ తెలిపారు.


