● పురుగుల మందు తాగి మృతి
● సిరిగిరిపేట్‌లో ఘటన
● కరన్‌కోట్ పీఎస్‌లో కేసు నమోదు
తాండూరు రూరల్: వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక, మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాండూరు మండలం సిరిగిరిపేట్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వినోద్ రాథోడ్, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అగ్గనూర్ లక్ష్మి(35), వీరప్ప దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పంట పెట్టుల కోసం ఏడాది క్రితం ఇదే ఊరికి చెందిన హన్మంత్‌రెడ్డి వద్ద మూడు రూపాయల వడ్డీకి రూ.లక్ష తీసుకున్నారు. కొద్ది నెలలుగా వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఇటీవల అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతినడంతో నష్టపోయి, వడ్డీ చెల్లించలేకపోయారు. ఈక్రమంలో శుక్రవారం హన్మంత్‌రెడ్డి తన భార్య ఉమాదేవితో కలిసి వీరప్ప ఇంటికి వెళ్లారు. తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఉగాది వరకు చెల్లిస్తామని, అప్పటి వరకు తమ బైక్ తీసుకెళ్లమని లక్ష్మి చెబుతున్నా పట్టించుకోకుండా గ్రామస్తుల ఎదుట అవమానపర్చారు. ఈ ఘటనను అవమానంగా భావించిన లక్ష్మి మధ్యాహ్నం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తల్లి మరణాన్ని తట్టుకోలేని లక్ష్మి కొడుకు, కూతురు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వీరప్ప ఫిర్యాదు మేరకు కరన్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు.


