ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పని చేస్తే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికై న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులపై అనేక బాధ్యతలు ఉన్నాయని, ప్రజలతో మమేకమై పనులు చేసినప్పుడే ప్రజల మన్ననలు పొందుతారని అన్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని, వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక రూపొందించాలని, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. రోడ్డు భద్రత, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చూడాలన్నారు. రాష్ట్ర మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ టీకే శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలని, బాధ్యతతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పథకాల అమలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి


