ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని కౌన్సిలర్ ఆంజనేయులుయాదవ్ కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వి ద్యాశాఖ కార్యాలయంలో గురువారం ఈ మేరకు ఆయన వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్‌ను రద్దు చేసి పాఠశాలలోనే విధులు నిర్వహించేలా చూడాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు.
108 అంబులెన్స్‌లో ప్రసవం
అబ్దుల్లాపూర్‌మెట్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ అంబులెన్స్‌లో ప్రసవించిన సంఘటన గురువారం ఉదయం మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుంతపల్లి గ్రామానికి చెందిన లావణ్యకు పురిటి నొప్పుల రావడంతో 108 వాహనానికి కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 వాహన మెడికల్ టెక్నిషీయన్ దశరథ, పైలట్ చెరుకు శ్రీనివాస్ సాధారణ ప్రసవం చేశారు. ఫలితంగా లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో హయత్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తల్లీశిశువును తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా లావణ్య కుంటుబీకులు అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలయజేశారు.
మహిళా సమస్యల పరిష్కారానికి ‘జన్ సున్వాయ్’
హాజరైన జాతీయ మహిళా కమిషనర్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్
సాక్షి, సిటీబ్యూరో: మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) నడుం బిగించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఈనెల 8 నుంచి 13 వరకు ఎన్‌సీడబ్ల్యూ దేశవ్యాప్తంగా మహిళా జన్ సున్వాయ్ (పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గురువారం మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో మహిళలు ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి మహిళా జన్ సున్వాయ్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా నుంచి 30 ఫిర్యాదులు, ఐదు వాక్ ఇన్ ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ప్రధానంగా గృహ హింస, వేధింపులు, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. ఆయా కేసులను ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ సమీక్షించి సత్వర చర్యలు, పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఏసీబీ తెలంగాణ డీజీ చారు సిన్హా, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ కే అవినాష్ మొహంతి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సీపీ ఎం శ్రీనివాస్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఇతర అధికారులు హాజరయ్యారు.
11కిలోల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురితోపాటు నలుగురు వినియోగదారులను పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ పోలీసులు గురువారం తెలిపిన మేరకు.. చిలకలగూడ డబుల్ బెడ్‌రూం క్వార్టర్స్ సమీపంలో కొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్, ఇన్‌స్పెక్టర్ రామకృష్ణలు సిబ్బందితోకలిసి దాడులు చేసి సుభాష్ మిషాల్(33), పబిత్ర బీరా(24), బాపున్ బిడికా(24)లతో పాటు మరో నలుగురు గంజాయి వినియోగదారులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 11.530 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.


