శంషాబాద్ రూరల్: బైక్‌పై స్నేహితుడిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థితో పాటు యువకుడు మృతి చెందాడు. బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సూరజ్(17) కొత్తూరులో అక్కబావల వద్ద ఉంటూ శంషాబాద్‌లోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. బీహార్ వాసి విక్కీసింగ్(22) స్థానికంగా ఉంటూ కూలీ పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. విక్కీ సింగ్ రెండు నెలల క్రితం కొత్త బైక్ కొన్నాడు. విక్కీసింగ్, సూరజ్ స్నేహితులు కావడంతో శంషాబాద్‌లోని పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి ఇద్దరూ కలిసి బైక్‌పై కొత్తూరు నుంచి బయలుదేరారు. విక్కీసింగ్ బైక్ నడుపుతుండగా.. సూరజ్ వెనకాల కూర్చున్నాడు. మదన్‌పల్లి పాతతండా సమీపంలో జాతీయ రహదారిపై వెనక నుంచి అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. బైక్‌ను ఢీకొన్న వాహనం వీరిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది.
మానవత్వం చాటుకున్న మంత్రి
హైదరాబాద్ నుంచి మక్తల్ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర మంత్రి శ్రీహరి ఘటన స్థలానికి కొద్ది దూరం వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే తన సిబ్బందితో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించి మృతదేహాలను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు సహాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్‌లో హిట్ అండ్ రన్
బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
మృతుల్లో పరీక్షకు వెళ్తున్న ఇంటర్ విద్యార్థి


