జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి
మాదాపూర్: మూసీనదిలోకి చేరే ముందు మురుగునీటిని దాదాపు 100 శాతం శుద్ధి చేసే విధంగా అదనపు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. మాదాపూర్ సైబర్ గార్డెన్ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సదస్సు (హైడ్రెకాన్–2026) నిర్వహించారు.ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో గత 10 సంవత్సరాలలో నీటి కనెక్షన్లు 8 లక్షల నుంచి 14 లక్షలకు పైగా పెరిగాయన్నారు. దీని వల్ల తాగునీటి అవసరం గణనీయంగా పెరిగిందని వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సుమారు రూ.7300 కోట్ల వ్యయంతో గోదావరి ఫేజ్–2, ఫేజ్–3 ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే నగరంలో తాగునీటి సరఫరా మెరుగుపడుతుందన్నారు. అనంతరం మూసీ రివర్‌ప్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు, నగరంలో మౌలిక వసతులు, పర్యాటకం, నీటి నిర్వహణ, పట్టణ ప్రణాళికలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఐఐ ఐజీబీసీ జాతీయ చైర్మన్ శేఖర్‌రెడ్డి, క్రెడాయి జాతీయ అధ్యక్షుడు జి.రామ్‌రెడ్డి, క్రెడాయి హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయ్‌సాయి మేక, నారెడ్కో జనరల్ సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి, హైబిజ్ వన్ ఎల్‌ఎల్‌పీ ఫౌండర్ జె.సంద్యారాణి, హైబీజ్ టీవి ఫౌండర్ రాజ్‌గోపాల్ పాల్గొన్నారు.


