సాక్షి, రంగారెడ్డి జిల్లా: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లకు తోడు.. హైపర్ టెన్షన్, మధుమేహం, యాంటీబయోటిక్, పెయిన్ కిల్లర్స్ వంటి మందులు అతిగా వాడటంతో చిన్న వయసులోనే కిడ్నీల పనితీరు దెబ్బతింటోంది. జిల్లాలో ఏటావేయికిపైగా కిడ్నీ సంబంధ కేసులు నమోదవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గత నాలుగేళ్లలో 3,760 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు పొందుతున్నారు. ఇక నగదు చెల్లించి, ప్రైవేటు ఇన్సూరెన్సు కార్డులు సహా ఈఎస్‌ఐ, ఆర్టీసీ, సింగరేణి, సీజీ హెచ్‌ఎస్, ఈజేహెచ్‌ఎస్, తదితర పథకాల్లో భాగంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందిన వారి సంఖ్య రెండింతలు ఉన్నట్లు అంచనా.
80శాతం మందికి తెలీదు
ఐసీఎంఆర్ సర్వే ప్రకారం 12శాతం మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన అంశమేమంటే బాధితుల్లో 80 శాతం మందికి తమకు కిడ్నీ సమస్య ఉన్నట్లు తెలియదు. వీరంతా 90శాతం కిడ్నీ పాడైన తర్వాతే చికిత్సలకు వస్తున్నారు. ఇదిలా ఉండగా బాధితుల్లో 70 శాతం మంది పురుషులు ఉంటే, 30 శాతం మహిళలు ఉంటున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో 80 శాతం పురుషులు ఉండగా, మహిళలు 20శాతమే ఉంటున్నారు. మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారిలో 93శాతం పురుషులు, కేవలం 7శాతమే మహిళలు ఉంటున్నారు. కానీ కిడ్నీ దాత(లైవ్ కిడ్నీ డోనర్స్)ల్లో మాత్రం 80 శాతం మహిళలే ఉంటుండటం గమనార్హం.
ఐదు దశలుగా విభజిస్తే..
మొదటి దశలో 10 శాతం దెబ్బతిన్నప్పుడు అసలు లక్షణాలేమీ తెలియవు. రెండో దశలో 20–40 శాతం దెబ్బతిన్నప్పుడు అధిక రక్తపోటు, మూత్రంలో ప్రొటీన్ వెళ్లిపోవడం. ఇక మూడో దశలో 40–70 శాతం దెబ్బతిన్నప్పుడు రక్తహీనత, ఎముకలు బలహీనపడడం.. ఈ దశలో రక్తంలో పరీక్షలుచేస్తే క్రియేటినిన్ పెరగడం గుర్తించొచ్చు. నాలుగో దశలో 70–85 శాతం దెబ్బతిన్నప్పుడు.. కాళ్ల వాపులు, తలనొప్పి వంటి సమస్యలు కన్పిస్తాయి. ఐదో దశలో 85శాతానికి కంటే ఎక్కువగా పనిచేయనప్పుడు.. రక్తశుద్ధి అవసరమవుతుంది. లేదా మూత్రపిండాల మార్పిడి చేయాల్సి వస్తుంది.
కారణాలివే: డాక్టర్ కె.లలితాదేవి, డీఎంహెచ్‌ఓ
● అధిక బరువు, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం
● హైపర్‌టెన్షన్, మధుమేహం
● పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్, యాంటి ఆకై ్సడ్ మందులు ఎక్కువగా వాడటం
● మద్యం, మాంసాహారాలు ఎక్కువగా తీసుకోవడం
● శరీరానికి రోజుకు సగటున 3 నుంచి 4 లీటర్ల నీరు అవసరం కాగా.. ఒకటి రెండు లీటర్లకు మించి తాగకపోవడం.
● మూత్ర విసర్జనను ఆపుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.
● హైప్రొటీన్ డైట్ విషయంలోనూ జాగ్రత్తలు చూసుకోవాలి.
కబళిస్తోన్న అధిక రక్తపోటు, మధుమేహం, ఇన్‌ఫెక్షన్లు
ఏటా పెరుగుతున్న మూత్రపిండాల వైఫల్య కేసులు
ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం జిల్లాలో 3,760 మంది బాధితులు
గణాంకాల్లోకి చేరని బాధితులు
పదింతలున్నట్లు అంచనా
చికిత్స కంటే నివారణపైనే దృష్టి పెట్టాలంటున్న నిపుణులు
నేడు అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవం


