● పారిశుద్ధ్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదు
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
మీర్‌పేట: హైడ్రా ద్వారా అన్ని చెరువులను అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి సూచించారు. బడంగ్‌పేట సర్కిల్ పరిధిలోని మీర్‌పేట, జిల్లెలగూడ డివిజన్లలో బుధవారం తెల్లవారుజామున డీసీ, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించి పారిశుద్ధ్యం, చందన చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఔటర్ లోపల ఉన్న వందలాది చెరువులను కోట్ల రూపాయలహెచ్‌ఎండీఏ నిధులు వెచ్చింది అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రెండేళ్లలో తాము అభివృద్ధి చేసిన చెరువులన్నీ ప్రస్తుతం నిర్వహణ లేక అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని, దోమలు, చెత్తా చెదారంతో దర్శనమిస్తూ, పోకిరీలకు అడ్డాలుగా మారడంతో వాకర్స్‌కు ఇబ్బందిగా మారిందన్నారు. చెరువుల నిర్వహణ బాధ్యతపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్లపై చెత్త ఉంటోందని, పారిశుద్ధ్య సిబ్బంది సరిగ్గా పనిచేయడం లేదని, చెత్త ఎక్కడైనా కనిపిస్తే సస్పెండ్ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి అనడం పాలనపై చిత్తశుద్ధి లేక తప్పించుకునేందుకేనని ఆరోపించారు. కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించిన పారిశుద్ధ్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా స్వచ్ఛ ఆటోలు, సౌకర్యాలు, అదనపు సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో కేటీఆర్ 4,500 స్వచ్ఛఆటోలను ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం చందన చెరువు వద్ద వాకర్స్, పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట డీసీ సరస్వతి, శానిటేషన్ డీఈ అభినయ్‌కుమార్, ఏఈ గంగాప్రసాద్, స్థానిక నాయకులు అర్కల కామేశ్‌రెడ్డి, జటావత్ శ్రీనునాయక్, అనిల్‌యాదవ్, మాదరి రమేశ్, నర్సిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


