ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు ఉగాది పండగకు గృహప్రవేశాలు చేయాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ పొట్రు సూచించారు. బుధవారం ఆయన ఆదిబట్ల జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని బొంగ్లూర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మూల విమల, అండేకార్ జహంగీర్, చెన్ను రాణి, సరిత, కామేటి విజయ, జర్పుల లక్ష్మి, అండేకార్ సుజాత నిర్మిస్తున్న ఇళ్ల వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు సకాలంలో వస్తున్నాయా లేదా.. బిల్లులు మంజూరుకు ఎవరైనా లంచం అడుగుతున్నారా అని తెలుసుకున్నారు. కాగా అలా ఏమీ లేదని బదులిచ్చారు. ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలు ఎలా ఉన్నాయి అడగ్గా ధరలు పెరిగాయని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోతున్నాయా ప్రశ్నించగా అదనంగా మరో రూ.5 లక్షలకు పైగా ఖర్చు అవుతోందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం మధ్యలో నిలిపేసిన వారికి మెప్మా ద్వారా రుణాలు అందించి సహకరించాలని, బిల్లులు చెల్లించిన వెంటనే మళ్లీ రుణాలు చెల్లించేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిందని ఇందులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికి అసలు పనులు ప్రారంభించని ఇళ్లు ఉంటే కారణాలు తెలుసుకుని నిర్మాణాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. కొంత మంది లబ్ధిదారులకు అదనంగా ఇళ్లు కేటాయించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎండీని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్ పీడీ నాయక్, డీఈ సంపత్‌కుమార్/, ఏఈ నందిని, జీహెచ్‌ఎంసీ మేనేజర్ రమేశ్, వార్డు అధికారులు హనుమంతు, శ్రీశైలం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ పొట్రు
నిర్మాణం నిలిచిపోయిన వారికి మెప్మా రుణాలు అందించాలని అధికారులకు ఆదేశం
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక


