పల్లెల్లో బిల్లుల పంచాయితీ మొదలైంది. ముందు పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్‌లు ఒత్తిడి తెస్తుండగా, ఆ పనులతో తమకు సంబంధం లేదంటూ తాజా సర్పంచ్‌లు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా తాజా, మాజీల మధ్య కార్యదర్శులు నలిగిపోతున్నారు. ఎటువైపు మొగ్గు చూపితే ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, రంగారెడ్డిజిల్లా
రెండేళ్ల విరామం తర్వాత 15వ ఆర్థిక సంఘం జిల్లాలోని 525 పంచాయతీలకు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయా జీపీల ఖాతాల్లో రూ.38.95 కోట్లకుపైగా నిధులు జమయ్యాయి. వచ్చిన నిధులను వివిధ అభివృద్ధి పనులకు వినియోగించాలని తాజాగా ఎన్నికై న పాలకమండళ్లు భావిస్తుండగా, అదేమీ కాదు.. ఇప్పటికే తాము ఆస్తులు అమ్ముకుని అభివృద్ధి పనులు చేపట్టామని, ముందు తమ బకాయిలు చెల్లించిన తర్వాతే మిగిలిన చూసుకోవాలని మాజీలు స్పష్టం చేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు కార్యదర్శులతో వాగ్వాదానికి దిగుతుండటం విశేషం.
నిధులు ఇలా..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని 14 జీపీల ఖాతాల్లో రూ.1.28 కోట్లు జమ కాగా, ఆమనగల్లులోని 13 జీపీలకు రూ.85.74 లక్షలు, చేవెళ్లలోని 25 జీపీలకు రూ.1.67 కోట్లు, ఫరూఖ్‌నగర్‌లోని 47 జీపీలకు రూ.2.93 కోట్లు, ఇబ్రహీంపట్నంలోని 14 జీపీలకు రూ.1.59 కోట్లు, చౌదరిగూడలోని 24 జీపీలకు రూ.1.51 కోట్లు, కడ్తాల్‌లోని 24 జీపీలకు రూ.1.89 కోట్లు, కందుకూరులోని 35 జీపీలకు రూ.2.66 కోట్లు, కేశంపేటలోని 29 జీపీలకు రూ. 2.06 కోట్లు, కొందుర్గులోని 22 జీపీలకు రూ.1.39 కోట్లు, కొత్తూరులోని 12 జీపీలకు రూ.1.05 కోట్లు, మాడ్గులలోని 34 జీపీలకు రూ.2.41 కోట్లు, మహేశ్వరంలోని 30 జీపీలకు రూ.2.16 కోట్లు, మంచాలలోని 23 జీపీలకు రూ.2.25 కోట్లు, మొయినాబాద్‌లోని 19 జీపీలకు రూ.1.30 కోట్లు, నందిగామలోని 19 జీపీలకు రూ.1.45 కోట్లు, షాబాద్‌లోని 41 జీపీలకు రూ.2.43 కోట్లు, శంషాబాద్‌లోని 21 జీపీలకు రూ.1.63 కోట్లు, శంకర్‌పల్లిలోని 24 జీపీలకు రూ.1.85 కోట్లు, తలకొండపల్లిలోని 32 జీపీలకు రూ.2.11 కోట్లు, యాచారంలోని 24 జీపీల ఖాతాల్లో రూ.2.42 కోట్లు జమ అయ్యాయి.
వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికుల ఎదురుచూపు
జిల్లాలో 27 మండలాలు ఉండగా, 21 మండలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి పరిధిలో 525 పంచాయతీలు ఉన్నాయి. గత పంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం 2019 జనవరితో మొదలై 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఆయా పంచాయతీలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లాయి. ఫలితంగా రెండేళ్లుగా కేంద్రం నుంచి ఆయా పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. తాగునీటి బోర్ల రిపేర్లు సహా ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, వీధిలైట్లు, డ్రైనేజీ కాల్వల్లో పూడికతీత, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లింపు వంటి వాటికి కార్యదర్శులే నిధులు సమకూర్చాల్సి వచ్చింది. తెలిసిన పెట్రోల్ బంకులు, ఎలక్ట్రికల్, ఇతర షాపుల్లో ఖాతా పెట్టారు. ఒక్కో జీపీ నుంచి వారికి పెద్ద మొత్తంలోనే చెల్లింపు చేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ 2025 డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల కొత్త పాలక మండళ్లు కొలువుదీరడంతో 15వ ఆర్థిక సంఘం నాలుగు విడతల్లో ఆయా జీపీల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ప్రత్యేకాధికారుల పాలనలో రాసి పెట్టిన ఖర్చులు చెల్లించాలా? లేక మాజీల పాలనలోని బకాయిలు చెల్లించాలా? అనే అంశంపై క్లారిటీ లేకపోవడం ఆందోళనకు కారణమవుతోంది. కొత్తగా కొలువుదీరిన పాలకమండళ్లు మాత్రం బకాయిల చెల్లింపునకు ససేమిరా అంటున్నాయి. దీనికి తోడు మూడు నెలలుగా మూడు వేల మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. వచ్చిన నిధుల నుంచే వేతనాలు చెల్లించాలనే పంచాయతీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
పంచాయతీల ఖాతాల్లో రూ.38.95 కోట్లు జమ
15వ ఆర్థిక సంఘం నిధులతో ఖజానా కళకళ
చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటున్న మాజీ సర్పంచ్‌లు
వాటితో తమకు సంబంధం లేదంటున్న తాజా సర్పంచ్‌లు
ఇద్దరి మధ్య నలిగిపోతున్న కార్యదర్శులు


