మొయినాబాద్: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుభాష్ అన్నారు. మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్‌లో మంగళవారం టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రోజువారీగా అన్ని గ్రామాల్లో పశువైద్యాధికారులు, సిబ్బంది పశువులకు టీకాలు వేస్తారని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి అహ్మద్, సిబ్బంది ప్రసన్నకుమార్, భీమ్‌రావు, గోరేమియా తదితరులు పాల్గొన్నారు.
శంకర్‌పల్లి: హెచ్‌టీ (హార్బీ సైడ్ టోలరెంట్) పత్తితో ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయని, రైతులు వాటిని ఉత్పత్తి చేయొద్దని జిల్లా వ్యవసాయాధికారి ఉష సూచించారు. మండల పరిధిలోని మహాలింగాపురం రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దిలీప్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయంపై ఎక్కువగా దృష్టి సారించాలని, రసాయనాల వాడకం తగ్గించాలని అన్నారు. పత్తిసాగులో మెలకులవలు పాటించి అధిక దిగుబడి సాధించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గోవిందమ్మ, మండల వ్యవసాయాధికారి చైతన్య, సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఏ పార్టీకీ మద్దతివ్వొద్దని ఆ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల మహేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా, తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. గరిష్టంగా నాలుగు వారాల్లో ఎన్నిక పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజులు గడిచిపోవడంతో ఏ సమయంలోనైనా ఎన్నిక జరిపే అవకాశం ఉండొచ్చనే ఉద్దేశంతో బీజేపీ కౌన్సిలర్లు తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
చేవెళ్ల: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును అమలు చేయాలని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ పార్థసింహారెడ్డికి వివనతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ యాజ మాన్యం విద్యను వ్యాపారంగా మార్చి రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం ఉచితంగా సీట్లు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటీకీ ఎక్కడా ఎవరూ అమలు చేయడం లేదన్నారు. వచ్చే విద్యాసంవత్సరం అడ్మిషన్స్ తీసుకునే సమయానికి చట్టం అమలయ్యేలా చర్యలు చెపట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి బోజ్జి శ్రీకాంత్, సహాయ కార్యదర్శులు న్యాలట అశోక్, సునీల్ పాల్గొన్నారు.


