● యాచారంలో రైతు ఉత్పత్తిదారుల
కూరగాయల కేంద్రం మూత
● నిర్వహణ లేక ఆదరణ కరువు
● ఇబ్బందులు పడుతున్న మహిళా రైతులు
యాచారం: డ్వాక్రా సంఘాల్లోని మహిళా రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ప్రారంభించిన రైతు కూరగాయల (యాచారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్) ఉత్పత్తి కేంద్రం మూతపడింది. అధికారుల పర్యవేక్షణ లోపం, సరైన నిర్వహణ లేకపోవడంతో కేంద్రానికి కూరగాయలు తీసుకవచ్చే విషయంలో మహిళా రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో డ్వాక్రా సంఘాల్లోని మహిళలు తమ వ్యవసాయ పొలాల్లో పండించిన కూరగాయలకు సరైన ధర పొందేలా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళా రైతులు నగరంలోని మార్కెట్లకు కూరగాయల తరలించి ప్రయాణ చార్జీలతో పాటు సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆయా గ్రామాల్లో పండించిన కూరగాయలను మండల కేంద్రంలో ప్రారంభించిన ఉత్పత్తి కేంద్రంలో విక్రయించడానికి ఏర్పాటు చేశారు. 2017లో అప్పటి మంత్రి కేటీఆర్ యాచారంలో ప్రారంభించారు. ఈ కేంద్రానికి చైర్మన్, పది మందిని బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా నియమించారు. వీరికి ప్రత్యేక బ్యాంకు ఖాతా, చెక్ పవర్ అవకాశం కల్పించారు.
అధికారుల పర్యవేక్షణ లోపం
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మండల కేంద్రంలో ఉన్న రైతు కూరగాయల ఉత్పత్తి కేంద్రం మూతపడింది. ఈ కేంద్రం ప్రారంభం కొత్తలో మొండిగౌరెల్లి, చౌదర్‌పల్లి, చింతపట్ల, యాచారం, గునుగల్, గడ్డమల్లయ్యగూడ, మల్కీజ్‌గూడ, నందివనపర్తి, మొగుళ్లవంపు, గాండ్లగూడెం, తక్కళ్లపల్లి తదితర గ్రామాల నుంచి నిత్యం వందలాది టన్నుల వివిధ రకాల కూరగాయలు వచ్చేవి. తూకం వేయక ముందే ధర నిర్ణయించి రైతులకు బిల్లులు ఇచ్చేవారు. సేకరించిన కూరగాయలను బోయన్‌పల్లి మార్కెట్‌కు ప్రత్యేక వాహనాల్లో తరలించేవారు. బిల్లుల ఆధారంగా నేరుగా మహిళా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బుల జమ అయ్యేవి. నిర్వహణ లేక పైలెట్ కేంద్రం మూతపడి మర్చిపోయే పరిస్థితి వచ్చింది.
డ్వాక్రా సంఘాలకు దండిగా నిధులు
మండలంలోని ఆయా గ్రామాల్లో కూరగాయల పంటల సాగు గణనీయంగా పెరిగింది. వెయ్యి ఎకరాలకు పైగానే పంటలు ఉన్నాయి. దాదాపు 500 మంది మహిళా రైతులకు పైగా తమ వ్యవసాయ పొలాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. సాగును ప్రోత్సహించడానికి వివిధ పద్దుల కింద బ్యాంకుల నుంచి నుంచి 2025–26 కింద రూ.50 కోట్లకు పైగానే రుణాలిచ్చారు. అందులో అత్యధిక మంది మహిళా రైతులు వ్యవసాయ పొలాల్లోని పెట్టుబడులకే ఖర్చు చేశారు. రూ.కోట్లాది అప్పులు ఇస్తున్నా, కూరగాయల సాగు సమృద్ధిగా ఉన్నా యాచారం మండల కేంద్రంలో ఉన్న ఉత్పత్తి కేంద్రం మూతపడడంతో పట్టించుకునే వారే కరువయ్యారు.


