తాళం వేయబడి.. | - | Sakshi
Sakshi News home page

తాళం వేయబడి..

Mar 11 2026 8:37 AM | Updated on Mar 11 2026 8:37 AM

షాద్‌నగర్‌రూరల్‌: ‘ఇంగ్లిష్‌ బోధించే ఉపాధ్యాయుడు లేరు.. పరీక్షలు సమీపిస్తున్నాయి.. సిలబస్‌ ఇంకా పూర్తి కాలేదు.. పాఠాలు అర్థం కావడం లేదు.. కొన్ని నెలలుగా హెచ్‌ఎం పాఠశాలకు రావడంలేదు.. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదు’ అని వాపోతూ విద్యార్థులు పాఠశాలకు తాళం వేశారు. ఈ ఘటన మంగళవారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని విఠ్యాలలో చోటుచేసుకుంది. వివరాలివీ.. మండల పరిధిలోని విఠ్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న రవి విద్యార్థులకు ఇంగ్లిష్‌ బోధిస్తున్నారు. అధికారుల సూచన మేరకు కొంత కాలంగా తనిఖీల విభాగం (ఇన్‌స్పెక్షన్‌)లో విధులు నిర్వర్తిస్తూ పాఠశాలకు వెళ్లడం లేదు. దీంతో విద్యార్థులకు ఇంగ్లిష్‌ బోధించే వారు లేక ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఎంకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని విషయాన్ని సర్పంచ్‌ డుబ్బుల వెంకటయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్పంచ్‌, గ్రామపెద్దలు, తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మనోహర్‌ గ్రామస్తులతో మాట్లాడి తాళం తీయించారు. జరిగిన ఉదంతాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డీఈఓ హెచ్‌ఎం రవిని పాఠశాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు శాంతించారు.

ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలి

విధులకు హాజరుకాని ప్రధానోపాధ్యాయుడు రవిని వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ ఎంఈఓ మనోహర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న అధికారులకు విద్యార్థుల ఇబ్బందులు కనిపించడంలేదని ఆరోపించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఎందుకు వెనుకాడుతున్నారో ఈ ఘటన నిదర్శనమన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు చరణ్‌, బన్నీ, చెర్రీ తదితరులు ఉన్నారు.

పాఠాలు చెప్పడం లేదని విద్యార్థుల నిరసన

తల్లిదండ్రులు, గ్రామ పెద్దల మద్దతు

అంతా కలిసి ప్రభుత్వ పాఠశాలకు తాళం

ఎంఈఓ, డీఈఓ జోక్యంతో ఆందోళన విరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement