కందుకూరు: పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని డీపీఓ సురేష్‌మోహన్ హెచ్చరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ముచ్చర్ల, కందుకూరు, కొత్తగూడ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ముచ్చర్లలో కంపోస్టు యార్డు నిర్వహణ సరిగ్గా లేదని, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం కొత్తగూడ చౌరస్తాలో పర్యటించారు. రోడ్డు కిరువైపులా ఎందుకు చెత్తను పూర్తిస్థాయిలో తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడ చౌరస్తా, కందుకూరు చౌరస్తా మధ్య శ్రీశైలం హైవేపై పారుతున్న మురుగు నీటి సమస్యపై నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరు నిలవకుండా ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో నేషనల్ హైవే అధికారులు, పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. రోడ్లపై మురుగు పారకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత పంచాయతీ కార్యదర్శులదేనన్నారు. రోడ్లు, మురుగు కాల్వలను ఆక్రమించి చేసే నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. చెత్తను కాల్చనివ్వకుండా డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సరిత, ఏపీఓ గీత, సర్పంచులు సరికొండ పాండు, బొక్క సువర్ణ అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
డీపీఓ సురేష్‌మోహన్


