మహేశ్వరం: రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంత మాధవరెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని తుమ్మలూరు, మెహబ్బత్‌నగర్, ఘట్టుపల్లి, ఆకన్‌పల్లి, దుబ్బచర్ల, కోళ్లపడకల్, పోరండ్ల, మహేశ్వరం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగియగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. యాప్ ద్వారా పంపిణీ చేయడంతో యూరియా దొరకడం లేదని, రైతులకు యాప్ ద్వారా బుక్ చేసుకోవడం అర్థం కావడం లేదన్నారు. ఏ కొర్రీలు పెట్టకుండా సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాంచందర్, విజయ్, అశోక్, నరేందర్, ముజీబ్, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


