రూ.5 వేల జరిమానా
తీర్పు వెల్లడించిన న్యాయస్థానం
చేవెళ్ల: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ చేవెళ్ల న్యాయస్థానం తీర్పు వెల్లడించిందని షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కాలనీలో వడ్డె రమేశ్ భార్య అనిత, ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవారు. ఇదిలా ఉండగా, 2021 జూలై 12న అర్ధరాత్రి వేళ అనిత ఎవరితోనే ఫోన్‌లో మాట్లాడుతోందని అనుమానించిన రమేశ్ గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు షాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. విచారణలో భాగంగా సోమవారం చేవెళ్లలోని 18వ ఏడీజే కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన షాబాద్ సీఐ కాంతారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీపారాణి, కోర్టు కానిస్టేబుల్ ఎండీ అనీఫ్, ప్రభాకర్‌ను చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ అభినందించారు.
బైక్‌ను ఢీ కొట్టిన కారు : ఒకరు మృతి
శంకర్‌పల్లి: మద్యం మత్తులో కారును అతివేగం, అజాగ్రత్తతో నడుపుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం మాదిరెడ్డిపల్లికి చెందిన నర్సింలు (45) పట్టణ శివారులోని సిమెంట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకొని కందుకూరులోని తన బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. శంకర్‌పల్లి మండలం మహాలింగాపురానికి చెందిన మాచన్నగారి లక్ష్మారెడ్డి ఫుళ్లుగా మద్యం తాగి కారులో వెళ్తున్నాడు. పట్టణ శివారులోని ఫత్తేపూర్ వద్దకు రాగానే ఎదరుగా వస్తున్న బైక్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మద్యం తాగినట్లు గుర్తించి సోమవారం రిమాండ్‌కి తరలించారు.
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి ఎద్దులతో రైతులు హాజరై పోటీలో పాల్గొన్నారు. సైరా బసవన్న సై.. అంటూ పోటీలను సర్పంచ్ కానుగుల అనిత మల్లేశ్ ప్రారంభించారు. పోటీలో మొదటి బహుమతిగా రూ.1.10 లక్షల నగదు, రెండో బహుమతిగా రూ.90 వేలు నగదు, 3వ బహుమతిగా రూ.70వేలు నగదు, నాల్గవ బహుమతిగా రూ.50 వేలు నగదును అందించారు. పోటీల్లో పాల్గొన్న రైతులందరికీ ప్రోత్సాహక బహుమతిగా ఒక్కొక్కరికి రూ.10 వేలు అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్, మాజీ ఎంపీటీసీ రవి తదితరులు పాల్గొన్నారు.


