ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

Mar 10 2026 1:27 PM | Updated on Mar 10 2026 1:27 PM

కడ్తాల్‌: కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌యూటీఎఫ్‌) జిల్లా కార్యదర్శి శంకర్‌ డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఈ నెల 20న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో టీఎస్‌యూటీఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి శంకర్‌, మండల అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 495 కేజీబీవీ పాఠశాలల్లో 1.25లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆయా చోట్ల 1657 మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రారంభించిన కేజీబీవీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని చెప్పారు. కేజీబీవీల్లో చాలీచాలని వేతనాలు ఇస్తున్నారన్నారు. ఉద్యోగ భద్రత కరువైందని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులను, స్పెషల్‌ ఆఫీసర్లను ప్రిన్సిపాల్స్‌గా, టీజీసీఆర్‌టీలను జేఎల్‌గా, సీఆర్‌టీలను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్లు ఇచ్చి వారిని రెగ్యూలర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఈనెల 16న జిల్లా కేంద్రంలో ధర్నాలు, 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు మల్లయ్యగౌడ్‌, కోశాధికారి నర్సింహమూర్తి, నాయకులు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement