మొయినాబాద్: హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మండలంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. నగరానికి అతిచేరువలో ఉండటంతో వీటి విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో పలుచోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. పేదలకు పంపిణీ చేసిన భూముల ను, కొంతమంది పెద్దలు నిబంధన లకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. గతంలో నే రెవెన్యూ అధి కారులు పీఓటీ చట్టం కింద వీటిని స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సదరు స్థలాలు కబ్జాదారుల చెరలోనే ఉన్నాయి. పలు చోట్ల కబ్జాకు గురైన ప్రభుత్వ, అసైన్డ్ భూములపై కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. ఓఆర్‌ఆర్ పక్కనే ఉన్న మొయినాబాద్ ప్రాంతంలోని భూముల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతోపాటు కబ్జాలకు గురైన స్థలాలను సైతం స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి రెవెన్యూ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు.
ఎనికేపల్లిలో 99 ఎకరాలు స్వాధీనం
మొయినాబాద్ మండలంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. ఎనికేపల్లి రెవెన్యూ పరిధి 180 సర్వే నంబర్‌లోని 99.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు కొంతమంది భారీ పథకం వేశారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్లు సైతం పూర్తయ్యాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో సీఎం దృష్టి సారించారు. వెంటనే ఆ భూములను గోశాలకు కేటాయించి, హెచ్‌ఎండీ ఏకు అప్పగించారు.
వందలాది ఎకరాలకు కంచె
పెద్దమంగళారం రెవెన్యూ సర్వేనంబర్ 149లో 159 ఎకరాలు, 218లో 220 ఎకరాల సర్కారు భూమి చుట్టూ కంచె నిర్మించారు. హిమాయత్‌నగర్ రెవెన్యూ సర్వేనంబర్ 151లో 38.29 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో 10.36 ఎకరాల స్థలం ఓ ప్రైవేటు విద్యాసంస్థ ఆధీనంలో ఉంది. ఇటీవల సర్వే చేసిన అధికారులు ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ భూములను సైతం సమీకృత మార్కెట్‌కు కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నారు.
సర్కారీ భూములకు తహ‘సీల్’
ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఫెన్సింగ్ వేస్తున్న అధికారులు
విలువైన భూములను స్వాధీనం చేసుకుంటున్న యంత్రాంగం
కోర్టు వివాదాల్లో ఉన్నవాటి వివరాల సేకరణ
మొయినాబాద్‌లో రూ.వేలాది కోట్ల విలువైన భూముల స్వాధీనం
పేదల భూములపై పెద్దల కన్ను
నగర శివారులోని విలువైన ప్రభుత్వ భూముల కబ్జా చెర వీడుతోంది. ఖాళీగా ఉన్న సర్కారీ స్థలాలు పరాధీనం కాకుండా రెవెన్యూ అధికారులు నడుం బిగించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ దస్త్రాల దుమ్ము దులుపుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ భూములను గుర్తించి ఫెన్సింగ్ వేస్తూనే మరో పక్క.. ఇతరుల కబ్జా, కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల వివరాలను సేకరిస్తున్నారు.
అజీజ్‌నగర్ రెవెన్యూ 176 సర్వే నంబర్‌లో 220.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 1962లో పేదలకు 94.08 ఎకరాలు పంపిణీ చేశారు. ఈ భూములపై కొందరు పెద్దల కన్నుపడింది. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పట్లోనే పీఓటీ చట్టం కింద రెవెన్యూ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, కబ్జా మాత్రం విడిపించలేకపోయారు. తాజాగా ఈ భూములను సమీకృత మార్కెట్‌కు కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే సర్వే నంబర్‌లో కబ్జాకు గురైన 75.07 ఎకరాల ప్రభు త్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


